విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.!
Publish Date:Sep 8, 2026
Advertisement
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది చాలా గొప్ప బంధానికి దారి తీస్తుంది. జీవితాంతం ఒకరికి ఒగరుగా ఉండటం కోసం వివాహం చేసుకుంటారు. కానీ కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భార్యాభర్తలు విడిపోవాల్సి వస్తుంది. చట్టబద్దంగా విడాకులు తీసుకుని విడిపోతుంటారు. విడాకులు పొందిన తర్వాత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన నిర్ణయం. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, ఏర్పడిన మానసిక పరిపక్వత ఈ కొత్త ప్రయాణానికి పునాదిగా నిలుస్తాయి. అయితే కొందరు తొందరపడి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంటారు. కానీ ఇలా చేసే తొందరపాటు పని రెండవ వివాహం తర్వాత కూడా జీవితాన్ని విచ్చిన్నం చేస్తుంది. రెండవ సారి వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని విషయాలు ఆలోచించడం, కీలకమైన జాగ్రత్తలు పాటించడం , కొన్ని విషయాలలో ముందే స్పష్టత తెచ్చుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల భవిష్యత్తు జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది. మళ్లీ పెళ్లి చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు , ఏ ఏ విషయాల్లో స్పష్టత అవసరమో తెలుసుకుంటే.. గతం నుండి బయటపడటం.. విడాకుల తర్వాత మరో పెళ్లికి సిద్ధపడే ముందు, పాత బంధం కలిగించిన బాధలు, కోపాలు, అసంతృప్తుల నుంచి పూర్తిగా కోలుకోవాలి. మానసిక ప్రశాంతత లభించినప్పుడే కొత్త వ్యక్తికి మన జీవితంలో సరైన స్థానం ఇవ్వగలుగుతాం. పాత గాయాలు మానకుండా ఇంకొకరితో ప్రయాణం మొదలుపెడితే, చిన్న చిన్న విషయాలకే పాత జ్ఞాపకాలు గుర్తుకువచ్చి కొత్త బంధంలో అపార్థాలకు దారితీస్తాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దని గ్రహించడం.. ఒంటరితనాన్ని జయించడానికో లేదా సమాజం ఏమనుకుంటుందో అనే భయంతోనో మరో పెళ్లి చేసుకోకూడదు. జీవితంలో నిజంగా ఒక తోడు కావాలని, కొత్త జీవితాన్ని పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనిపించినప్పుడు మాత్రమే ముందడుగు వేయాలి. సమయం తీసుకుని ఆలోచించడం ఎంతైనా మంచిది. స్వయం పరిశీలన చేసుకోవడం.. గత బంధంలో లోపాలు ఎక్కడ జరిగాయి, మీ వైపు నుంచి ఏవైనా పొరపాట్లు ఉన్నాయా అనే అంశాలపై నిజాయితీగా ఆలోచించుకోవాలి. గత తప్పులను గుర్తించడం వల్ల వాటిని రాబోయే కొత్త బంధంలో మళ్లీ చేయకుండా జాగ్రత్తపడవచ్చు. కొత్త భాగస్వామి విషయంలో ఉండాల్సిన స్పష్టత.. పారదర్శకత , నిజాయితీ.. గత విడాకులకు సంబంధించిన పూర్తి వివరాలను కొత్త భాగస్వామికి స్పష్టంగా చెప్పాలి. ఏ విషయాలనూ దాచకూడదు. చట్టపరంగా విడాకుల ప్రక్రియ పూర్తి అయిందో లేదో తెలియజేయడం చాలా ముఖ్యం. గత జీవితం గురించి ఎంత స్పష్టంగా ఉంటే, కొత్త బంధంలో నమ్మకం అంత త్వరగా బలపడుతుంది. ఆర్థిక విషయాలపై స్పష్టత.. ఆర్థిక సమస్యలు చాలా సంబంధాలలో విభేదాలకు కారణమవుతాయి. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అప్పులు, సంపాదన, అలాగే గత భాగస్వామికి ఇస్తున్న లేదా పొందుతున్న భరణం వంటి విషయాలను కొత్త భాగస్వామితో వివరంగా చర్చించాలి. ఇద్దరి ఆర్థిక బాధ్యతలను ఎలా పంచుకుంటారో ముందే ఒక అవగాహనకు రావడం మంచిది. పిల్లల బాధ్యతలు , పెంపకం.. ఒకవేళ మొదటి పెళ్లి ద్వారా పిల్లలు ఉంటే, వారి విషయంలో పూర్తి స్పష్టత ఉండాలి. పిల్లల పెంపకం, వారి చదువు, కస్టడీ హక్కులు, సమయం కేటాయించడం వంటి విషయాలపై కొత్త భాగస్వామి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. కొత్త భాగస్వామి మీ పిల్లలను ఎలా స్వీకరిస్తారు, వారి పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది చాలా కీలకం. అలాగే, రాబోయే రోజుల్లో కొత్తగా పిల్లలను కనాలా వద్దా అనే అంశంపై కూడా ఇద్దరి మధ్య అవగాహన ఉండాలి. వ్యక్తిగత హద్దులు, ఆశించడాలు.. ప్రతి ఒక్కరికీ కొన్ని వ్యక్తిగత ప్రాధాన్యతలు, సరిహద్దులు ఉంటాయి. కెరీర్, కుటుంబ సభ్యులతో సంబంధాలు, లైఫ్ స్టైల్, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాలలో పరస్పరం ఏమేమి ఆశిస్తున్నారో స్పష్టంగా మాట్లాడుకోవాలి. మీ ఆలోచనలు, వారి ఆశయాలు సరిపోలుతున్నాయో లేదో గమనించాలి. సహనం , ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్.. మళ్లీ పెళ్లి చేసుకున్న కొత్తలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. చిన్న చిన్న విషయాలకు పాత భాగస్వామితో కొత్త వారిని పోల్చడం తప్పు. ప్రతి వ్యక్తి భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారని గుర్తుంచుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు దాచకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.. విడాకులు జీవితానికి ముగింపు కాదు, అది ఒక కొత్త ఆలోచనకు, మార్పుకు ఆరంభం. ఆచితూచి అడుగులు వేస్తూ, పూర్తి మానసిక పరిపక్వతతో, స్పష్టమైన ఆలోచనలతో ముందడుగు వేస్తే రెండో పెళ్లి జీవితం మరింత సంతోషకరంగా, అర్ధవంతంగా మారుతుంది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/what-precautions-should-you-take-before-remarrying-after-divorce-35-230963.html





