సిగరెట్ తాగవద్దన్నందుకు పెట్రోల్ బంక్ ను తగలెట్టేయబోయాడు!?
Publish Date:Feb 21, 2026
Advertisement
పెట్రోల్ బంక్‌లో సిగరెట్ తాగవద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి ఏకంగా పెట్రోల్ బంకునే తగలబెట్టినంత పనిచేశాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్ జిల్లా ఉర్ల ప్రాంతంలో గురువారం (ఫిబ్రవరి 19) రాత్రి 7.40 గంటల సమయంలో ధర్మేంద్ర క్షత్రి, ఇమ్రాన్ అనే ఇద్దరు స్నేహితులు బైక్‌లో పెట్రోల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. ఇమ్రాన్ బైక్‌పై కూర్చుని పెట్రోల్ కొట్టిస్తుండగా.. వెనుక కూర్చున్న ధర్మేంద్ర కిందకు దిగాడు. ఒకవైపు బైక్‌కు పెట్రోల్ కొడుతుంటే.. ధర్మేంద్ర సిగరెట్ వెలిగించే ప్రయత్నం చేశాడు. అయితే పెట్రోల్ బంకులో ధూమపానం చేయొద్దని బైకుపై ఉన్న వ్యక్తి.. అతన్ని పక్కకు తోశాడు. దీంతో అసహనానికి గురైన ధర్మేంద్ర.. ఏకంగా తన స్నేహితుడి బైక్ పెట్రోల్ ట్యాంక్‌లో లైటర్‌తో మంట వెలిగించాడు. దీంతో బైక్ తో పాటు ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంధన పైపు, పెట్రోల్ మెషీన్‌కు కూడా మంటలు అంటుకోవడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. పెట్రోల్ మెయిన్ సప్లైని ఆపేశాడు. ఆ తర్వాత వెంటనే ఫైర్ సేఫ్టీ కిట్‌తో మంటలను ఆర్పేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే పెట్రోల్ బంక్ పేలిపోయే ప్రమాదం ఉండేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన యువకుడికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/trird-to-burn-petrol-bunk-36-214426.html





