ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్.. నవంబర్ 19న ప్రారంభం.!
Publish Date:Nov 13, 2026
Advertisement
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో సరికొత్త 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకానికి రూపకల్పన చేసింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19వ తేదీ నుంచి ఈ పథకానికి సంబంధించి లబ్దిదారుల నమోదు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ విప్లవాత్మక పథకం ద్వారా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతి కుటుంబానికీ జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కులం, మతం, ఆదాయంతో ఎలాంటి సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఈ రక్షణ వర్తింపజేయనున్నారు. ఈ స్కీమ్ నిబంధనల ప్రకారం కుటుంబంలో ప్రధానంగా సంపాదన ఆధారపడి ఉన్న వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తింపజేస్తారు. ఒకవేళ కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది సంపాదనపరులు ఉన్నట్లయితే, ఎవరి పేరుపై బీమా చేయాలనే అంశాన్ని ఆ కుటుంబ సభ్యులే స్వయంగా నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే బీమాకు సంబంధించిన నామినీలుగా ఒకరిని లేదా అంతకంటే ఎక్కువ మందిని ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా, వచ్చే బీమా మొత్తంలో ఏ నామినీకి ఎంత శాతం వాటా చెల్లించాలనే విషయాన్ని కూడా కుటుంబసభ్యులే ముందే స్పష్టంగా నిర్దేశించుకునేలా పారదర్శక విధానాన్ని రూపొందించారు. ఈ నమోదు ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణాలు, నగరాలు అలాగే ప్రతి గ్రామంలోనూ ఏకకాలంలో ఈ రిజిస్ట్రేషన్ల పర్వం కొనసాగనుంది. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రామాల్లో ప్రత్యేకంగా దండోరా వేయించి ప్రజలకు ఈ కార్యక్రమంపై ముందస్తుగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నమోదు ప్రక్రియ ముగిసిన అనంతరం సేకరించిన వివరాలను సంబంధిత కుటుంబ సభ్యుల సమక్షంలో చదివి వినిపించిన తదనంతరమే వారి సంతకాలు తీసుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ ఈ నిర్ణయం పట్ల సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: భారత జట్టులో ఆడాలన్న కల.. 19 ఏళ్లకే ముగిసిన యువ క్రికెటర్ జీవితం.! [ Telangana Indiramma Bima, Bhatti Vikramarka, Rs. 5 lakh life insurance, Indira Gandhi Jayanti, Telangana government schemes ]
http://www.teluguone.com/news/content/telangana-indiramma-bima-24-237046.html




