విద్యా ప్రాంగణాల్లో నో సినిమా ప్రమోషన్స్: తెలంగాణ సర్కార్ నిర్ణయం.!
Publish Date:Nov 10, 2026
Advertisement
రాష్ట్రంలోని విద్యా ప్రాంగణాలలో సినిమా ప్రమోషన్లు, ఇతర వాణిజ్య కార్యక్రమాల నిర్వహణను పూర్తిగా నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. క్యాంపస్లను కేవలం విద్య, క్రీడా కార్యకలాపాలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇందుకు గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనలే కారణమంటున్నారు అధికారులు. ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థుల భద్రతను విస్మరించి కొన్ని కళాశాలల యాజమాన్యాలు, వాణిజ్య ప్రయోజనాలు, ప్రచారం కోసం ఇలాంటి వేడుకలకు అనుమతి ఇస్తున్నాయనే విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విద్యాలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందనీ, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలలో ఏయే కార్యక్రమాలు చేపట్టవచ్చనే అంశంపై సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని విద్యాశాఖను రేవంత్ సర్కార్ ఆదేశించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఇరుముడి సినిమాకు తెలంగాణ కార్మిక శాఖ షాక్.. నిర్మాణ సంస్థకు నోటీసులు.! కొత్త నిబంధనల ప్రకారం విద్యా ప్రాంగణాల్లో సినిమా ప్రమోషన్లకు అవకాశం ఉండదు. అయితే, అత్యవసరంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే నిర్వాహకులు ముందుగానే పోలీసు, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. హాజరయ్యే జనాల సంఖ్యకు తగినట్లుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడం తప్పనిసరి చేయనున్నారు. ఈ నిబంధనలను అతిక్రమించి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే విద్యాసంస్థల యాజమాన్యాలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యాసంస్థలలో అనధికారిక ఈవెంట్లకు చెక్ పడుతుందని, విద్యార్థులకు సురక్షితమైన విద్యా వాతావరణం అందుబాటులోకి వస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీకు నచ్చవచ్చు: హైదరాబాద్లో దారుణం..మదర్సాలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు.! తెలంగాణను వణికిస్తున్న కోల్డ్ వేవ్: హైదరాబాద్ పై చలిపులి పంజా.! [Movie Promotions Ban in Educationa Institutions, Commercial Events, Telangana Government, Student Safety, First, Telugu One]
http://www.teluguone.com/news/content/movie-promotions-ban-in-educationa-institutions-24-236793.html





