రాజు గారు ఏమన్నా సలహా ఇచ్చారా..!
Publish Date:Dec 2, 2017
Advertisement
అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకుగాను బీజేపీ పెద్దలు వెంటనే ఆయనను బుజ్జగించే పని చేశారు. కానీ సోము వీర్రాజు మాత్రం.. కేంద్రం చేసింది ఒప్పే అన్నట్టు తిరిగి చంద్రబాబుపైనే విమర్శలు గుప్పించారు. కేంద్రం తెలిపిన అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వమే పరిష్కరించుకోవాలని.. అనవసర రాజకీయాలు చేయకుండా.. ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చంద్రబాబుకు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు టెండర్లు ఆపమని చెప్పి రాజకీయం చేస్తుంది ఎవరో మరి? కేంద్రం సహకరిస్తేనే అనే పదం సీఎం వాడటం సరికాదని.. సకాలంలోనే సహకరిస్తేనే ప్రాజెక్టు 60 శాతం పూర్తయిందన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదని ఆయన చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందే ఏపీ 5,135 కోట్లు ఖర్చు చేసింది. దాన్ని ఏపీ వాటాగా కేంద్రం పరిగణించింది. మిగిలిన 7,431 కోట్లల్లో ఇప్పటివరకు కేంద్రం 4,329 కోట్లు ఇచ్చారు. మరో 3,102 కోట్లు రాష్ట్రం ఖర్చు పెట్టగా అది కేంద్రం నుండి రావాల్సి ఉంది. మరి ఏ రకంగా కేంద్రం సకాలంలోనే సహకరిస్తేనే ప్రాజెక్టు 60 శాతం పూర్తయిందని చెప్పగల్గుతున్నారో వీర్రాజు కే తెలియాలి.
అదేదో సినిమాలో ఓ విలన్ గిల్లితే గిల్లిచ్చుకోవాలి అని చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా.. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పిన మాటలు చూస్తుంటే కూడా అలానే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టులో భాగంగా... స్పిల్‌వే, స్పిల్ చానల్‌లో కొన్ని పనులకుగాను ఏపీ ప్రభుత్వం టెండర్లకు ఆదేశాలిచ్చింది. అయితే జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్ అద్యయనం చేసేవరకు టెండర్లను నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఇక కేంద్రం వేసిన ఈ అడ్డుపుల్లపై స్పందించిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వంపై ఓపెన్ గానే సీరియస్ అయ్యారు. పోలవరం టెండర్ల విషయంలో కేంద్రం ఆపమంటే ఆపేస్తామనే.. కేంద్రం అదే వైఖరితో ఉంటే వాళ్ళకే అప్పజెప్పి నమస్కారం పెడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ పనులు ఆరునెలలపాటు ఆగిపోతే మళ్ళీ దారి పట్టించడం కష్టమని సీఎం తేల్చిచెప్పారు. పోలవరంపై ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్థం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సహకరిస్తే సరే...లేకుంటే మన కష్టమే మిగులుతుందని.. "నేను ఆశావాదిని....నా పని నేను చేస్తా.. మిత్రపక్షం కాబట్టే మరింత సహనంగా వ్యవహరిస్తున్నా" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేస్తానంటే ఇప్పటికిప్పుడే కేంద్రానికి అప్పగిస్తామన్నారు. కేంద్రం ముందుకొస్తే తనకెలాంటి భేషజాలు లేవని.. "పోలవరం పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నీతి ఆయోగ్ చెప్పింది.. నేనేమీ కావాలని తీసుకోలేదు" అని చంద్రబాబు చెప్పారు.
http://www.teluguone.com/news/content/somu-veerraju-45-79055.html





