క్రిస్మస్ వేడుకలకూ జనసమీకరణేనా జగన్?
Publish Date:Dec 26, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో ఓటమి తరువాత పూర్తిగా మారిపోయారు. అధికారంలో ఉన్నంత కాలం వందిమాగధులు తప్ప పార్టీ క్యాడర్, ద్వితీయ శ్రేణి నేతలు, ప్రజలు ఇలా ఎవరినీ దరి చేరనీయకుండా వ్యవహరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. తన వెంట ఇంకా జనం ఉన్నారని చాటుకోవడానికి నానా తంటాలూ పడుతున్నారు. ఎన్నికలలో ఓటమి పాలైనా తమ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందనీ, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయామనీ పదే పదే చెప్పుకున్న జగన్, ఇప్పుడు తాను బయటకు వస్తే జనం ఉండాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందుకే అధికారం కోల్పోయిన తరువాత ఆయన రాష్ట్రంలో చేసిన ప్రతి పర్యటనలోనూ శాంతి భద్రతలు అదుపుతప్పాయి. సామాన్య జనం ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఆంక్షలు విధించినా వాటిని ధిక్కరించి మరీ వైసీపీయులు జగన పర్యటనలకు జనాన్ని భారీ ఎత్తున సమీకరించి బల ప్రదర్శనకు దిగుతున్నారు. జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు. సరే ఆయన రాజకీయ ఓదార్పు, సమస్యలపై ప్రజల్లో చెతన్యం అంటూ చేస్తున్న పర్యటనలకు భారీ జనసమీకరణ చేయించుకున్నారంటే అర్ధం చేసకోవచ్చు, కానీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా పులివెందుల చర్చికి వెళ్లిన సందర్భంగా కూడా జిల్లా నలుమూలల నుంచీ జనాలను తరలించడం పట్లే పరిశీలకుల్లో సైతం విస్మయం వ్యక్తం అవుతున్నది. తాను బయటకు వచ్చినప్పుడు భారీగా జనం గుమిగూడకపోతే.. తాను చెప్పుకుంటున్న 40శాతం ఓటు బ్యాంకు మద్దతును ఎవరూ నమ్మరన్న సంశయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. జగన్ తన మూడు రోజుల పులివెందుల పర్యటనలో తొలి రోజు మాత్రమే జనం ముందుకు వచ్చారు. ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ తరువాత జ్వరం అంటూ ప్రీ క్రిస్మస్ వేడుకలకు కూడా దూరంగా ఉన్నారు. అంతే కాదు జనానికీ ముఖం చాటేశారు. కానీ క్రిస్మస్ రోజు న మాత్రం భారీ ఎత్తున జనసమీకరణకు పార్టీ నేతలను ఆదేశించారు. ఇక్కడే ఆయన ప్రీక్రిస్మస్ వేడుకలలో పాల్గొనకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రీ క్రిస్మస్ వేడుకలకు అయితే.. జగన్ కుటుంబ సభ్యులు వినా సామాన్య జనం వచ్చే అవకాశం ఉండదు. ఈ కారణంగానే ఆయన ప్రీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన లేదని అంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా పులివెందుల చర్చి వెలుపల కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడటాన్ని బట్టి చూస్తుంటే.. ఆయన బయటకు వచ్చేది బల ప్రదర్శన కోసమేనా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తం అవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/jagan-tours-depend-on-public-mobilization-45-211598.html





