ముక్తవరం పార్థసారథి కన్నుమూత
Publish Date:Mar 5, 2026
Advertisement
తెలుగు సాహిత్యంలో ప్రముఖ కథా, నవలా రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి హైదరాబాద్‌లో బుధవారం (మార్చి 4) కన్నుమూశారు. ముక్తవరం పార్థసారథి ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరిలో 1944 జూలై 7న జన్మించారు. పాఠశాల విద్య భువనగిరిలోనే పూర్తి చేసిన ఆయన ఉన్నత విద్యను హైదరాబాద్ లో పూర్తి చేశారు. ప్రభుత్వ ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముక్తవరం పార్ధ సారథి హైదరాబాద్ లోని నల్లగుండ్ల సిటిజన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధారం (మార్చి 4) సాయంత్రం కన్నుమూశారు. ముక్తవరం పార్థసారథి రంగుల వల, నువ్వు నేను చిన్నారావు, పరువు, కౌగిలి, కలల నీడలు, దమయంతి, మలివెలుగు, శూన్యం, మనసులోని చలి, కించిద్విషాదం, మినుగుర్లు వంటి సృజనాత్మక రచనలు చేశారు. అలాగే.. ప్రపంచ దేశాల సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. తొమ్మిది దేశాల కథలు, ఉక్కుపాదం (నవల) అపరాజిత, నరహంతకుని స్వగతం, చైనా జానపద కథలు, ఆలోచన ఆయుధంగా, దుష్ట రాజ్యం, సీగల్, నరహంతలు ధరాధిపతులై వంటి అనువాద రచనలతో పాటు నోబెల్ బహుమతి గ్రహీతల కథానికలను కూడా ఆయన తెలుగులోకి అనువదించి.. తెలుగు పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని పలువురు సాహితీ వేత్తలు తమతమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/prominent-writer-mukthavaram-parthasarathi-nomore-36-215055.html





