పొందూరు ఖాదికి జి.ఐ. టాగ్...రామ్మోహన్ నాయుడు హర్షం
Publish Date:Dec 13, 2025
Advertisement
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రమ ఫలించింది. శ్రీకాకుళం జిల్లాలో పుట్టి ప్రపంచ ఖ్యాతి సాధించిన పొందూరు ఖాదికి మళ్ళీ పూర్వ వైభవం సాధించి పెట్టేందుకు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా కృషి చేశారు. ఆ కృషి ఫలితంగానే పొందూరు ఖాదికి భౌగోళిక గుర్తింపు ప్రకటిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ పరిధిలోని భోగోళిక సూచికల రిజిస్ట్రీ శుక్రవారం నాడు అధికారిక పత్రాన్ని జారీ చేసింది. ఈ ప్రకటన పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చెయ్యగా… శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలేంటి జి.ఐ. టాగ్..? ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది. అదే వాటి ప్రత్యేకతగా నిలుస్తుంది.. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని.. వాటికి మరింత ప్రాధాన్యత ఇచ్చే విదంగా "ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999 ను ఏర్పాటు చేశారు. ఈ చట్టం క్రింద ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతంనుంచి వచ్చే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) వర్తిస్తుంది.తద్వారా మిగిలిన ఉత్పత్తుల కన్నా, మేలైనవిగా, విలువైనవిగా భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు నిలుస్తాయి. భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువు.. నకిలీ వస్తువుల నుండి కాపాడబడుతుంది. విలువైనదిగా కూడా మారుతుంది. ఇందుకోసం భోగోళిక సూచికల రిజిస్ట్రీ అనేక దఫాలుగా క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. నాణ్యతని అన్ని దశల్లో పరీక్షిస్తుంది. ప్రజల్లో ఉన్న ఆదరణను సైతం పరిగణలోకి తీసుకుంటుంది. అయితే మన దేశంలో అనేక విలువైన, అంతరించిపోయే దశలో అనేక ఉత్పత్తులు ఉన్నప్పటికీ చాలా కొద్ది వస్తువులు మాత్రమే ఈ తరహా భౌగోళిక గుర్తింపు సాధించగా.. అందులో పొందూరు ఖాదీకి జి.ఐ టాగ్ లభించడం వెనుక.. అప్పట్లో శ్రీకాకుళం ఎంపిగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు విశేష కృషి చేశారు. అనంతరం ఆగస్ట్ 3, 2021 పార్లమెంట్ లో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. మరోమారు జి.ఐ టాగ్ కోసం ప్రధానంగా, సుదీర్ఘంగా సభలో ప్రసగించారు. ఇక అది మొదలు అందుబాటులో ఉన్న అన్ని వేదికల్లో పొందూరు ఖాది ఖ్యాతిని వివరిస్తూ.. జి.ఐ టాగ్ కోసం యత్నించారు. కేంద్ర మంత్రి అయిన తరువాత మరింత వేగం పెంచారు. సంబంధిత శాఖపై ఈ తరహా గుర్తింపు సంఖ్య వచ్చేందుకు చర్యలు వేగవంతం అయ్యేలా కృషి చేశారు. తాజా శుక్రవారం నాడు అధికారికంగా పొందూరు ఖాదికి సంబంధించిన జి.ఐ టాగ్ గుర్తింపు ప్రతి అందుబాటులోకి వచ్చింది. పొందూరు ఖాదికి జి.ఐ టాగ్ నంబర్ 1049 కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చెన్నై కేంద్రంగా ఉన్న భోగోళిక సూచికల రిజిస్ట్రీ, ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని వెలువడించింది. ఇంతవరకు బాస్మతి బియ్యం,డార్జిలింగ్ తేయాకు, కాంచీపురం పట్టుచీరలు, పోచంపల్లి చీరలు (2005), మైసూరు పట్టు, కొండపల్లి, నిర్మల్ బొమ్మలు, మైసూర్ శాండల్ సబ్బు.. ఇలా కొన్ని ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపు ఉండగా.. ఇకపై పొందూరు ఖాది కూడా ఆ లిస్టులో చేరింది. దీని ద్వారా చట్టపరమైన గుర్తింపు, పొందూరు తప్ప.. ఈ తరహా విధానంలో ఇతరులు చేసే నకిలీ ఉత్పత్తులను అరికట్టే అవకాశం ఉంది. గడచిన కొన్నేళ్లుగా తన ఉనికి కోసం ప్రయత్నిస్తూ ఉన్న పొందూరు ఖాదికి.. జి.ఐ టాగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేసిన రామ్మోహన్ నాయుడు కు పొందూరు వాసులే కాదు.. ఉత్తరాంధ్ర ప్రాంతీయులు అభినందనలు తెలుపుతున్నారు. ప్రపంచ స్థాయి ఖ్యాతి ఉన్న పొందూరు ఖద్దరుకు.. జి.ఐ. గుర్తింపు రావడంతో భవిష్యత్ లో మరింతగా కీర్తి సంపందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ఎన్నో ఏళ్ల కల నెరవేరిన ఆనందమైన క్షణమని రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌ను జి.ఐ. రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసినట్లు గర్వంగా తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు.ఈ చారిత్రాత్మక గుర్తింపు.. పొందూరు ఖాదీ యొక్క ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాక, సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాదీ ఖ్యాతిని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలను తెరుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ గౌరవం తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న శ్రమకు మరియు నిబద్ధతకి అంకితం. వారి పట్టుదల, కళాత్మకత ఈ సంప్రదాయాన్ని నిలబెట్టి, శ్రీకాకుళాన్ని వారసత్వం మరియు గర్వానికి ప్రతీకగా నిలిపాయిని తెలిపారు. పొందూరు ఖాదీని మనం అందరం కలసి కాపాడుకుందాం, ప్రోత్సహిద్దాం, రాబోయే తరాలకు మన వారసత్వంగా అందిద్దామని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.
2020 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఆ సందర్భంగా పొందూరు ఖాది గురించి తెలుసుకున్నారు. ఇక్కడ నిర్మలా సీతారామన్ తో అప్పటి శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా భేటి అయ్యారు. అప్పటికే జి.ఐ టాగ్ విలువ తెలిసిన రామ్మోహన్ నాయుడు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు పొందూరు ఖాది ఖ్యాతిని వివరిస్తూ.. జి.ఐ. టాగ్ ను కేటాయించాలని తొలుత కోరారు. దీనికి ఆమె నుండి కూడా సానుకూల స్పందన లభించింది.
http://www.teluguone.com/news/content/pandur-khadi-gi-tag-36-210938.html





