8 నెలల క్రితం ప్రేమ పెళ్లి...భార్యను కొట్టి చంపిన భర్త
Publish Date:Dec 18, 2025
Advertisement
రెండక్షరాల ప్రేమ అనే మత్తులో పడిన యువతి తన తల్లిదండ్రులను ఒప్పించి... ప్రేమపెళ్లి చేసుకొని సంవత్సరం గడవకముందే భర్త తన విశ్వరూపం చూపించడంతో అది భరించలేక మృతి చెందిన ఘటన తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో ఉన్న సాయిపూర్ ప్రాంతంలో మానవత్వాన్ని కలిచివేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త, అత్తమామలు కలిసి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన అనూష (20) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వికారాబాద్ జిల్లాకి చెందిన అనూష, తాండూరు కి చెందిన పరమేష్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరిస్తూ...ఎనిమిది నెలల క్రితం పరమేష్‌ను, అనూష ప్రేమ వివాహం చేసుకుంది. కోటి ఆశలతో అత్తారింటిలో అడుగు పెట్టిన అనూషకు వేధింపులే ఎదురైయ్యాయి. అయితే ఈ పెళ్లి పరమేష్ తల్లిదండ్రులకు ఇష్ట్రం లేకపోవడంతో మొదటి నుంచి అనూషను వేధింపు లకు గురి చేస్తున్నారు. ప్రేమ పెళ్లిని అంగీకరించని అత్తమామలు అనూషతో తరచూ గొడవలకు దిగేవారు. ఇటీవల జరిగిన గొడవలో భర్త పరమేష్ కూడా జోక్యం చేసుకుని తల్లిదండ్రులతో కలిసి అనూషపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ పడిన అనూషను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అనూష మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కూతురు మరణించింది అని తెలియగానే ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. అత్త, మామ, భర్త కలిసి ప్రతిరోజు వేధింపులకు గురి చేసే వారిని.. తన కూతురిపై దాడి చేయడం వల్లే తన కూతురు మరణించింది అంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనూష మరణించిందని తెలియగానే భర్త పరమేష్‌తో పాటు అత్త లాలమ్మ, మామ మొగులప్ప పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనూష తల్లి చంద్రమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “పలుమార్లు వరకట్నం తీసుకురావాలంటూ నా బిడ్డతో గొడవ పడేవారు. ప్రతిరోజు నా బిడ్డను వేధింపులకు గురిచేసే వారిని... అత్త మామ భర్త ముగ్గురు కలిసి బాగా కొట్టి చివరకు ఆమె ప్రాణాలు తీసేశారు” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన మరోసారి ప్రేమ వివాహాలపై కుటుంబ విరోధం, వరకట్న వేధింపులు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో స్పష్టం చేస్తోంది. పోలీసులు నిందితులను త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/vikarabad-district-36-211212.html





