TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

మంత్రి కొండా సురేఖపై వేటు పడేనా..? అధిష్ఠానం వద్దకు చేరిన పంచాయితీ..!

ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..! తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం హస్తం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, కాంగ్రెస్ నేతల ప్రకటనలు పార్టీలో అంతర్గత విభేదాలను తీవ్రస్థాయికి చేర్చాయి. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా కొండా కుటుంబ సభ్యుల తీరు ఉందన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అత్యవసరంగా బెంగళూరు పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన భట్టి విక్రమార్క, రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా నివేదికను ఆయనకు సమర్పించినట్లు సమాచారం. బెంగళూరు భేటీ అనంతరం ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు వేదికగా మంత్రులు, సీనియర్ నేతల మధ్య వరుస భేటీలు జరగడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదంపై పార్టీ క్రమశిక్షణా కమిటీ నివేదికను సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపినట్లు సమాచారం. అందుతున్న వార్తల ప్రకారం, అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంటే మంత్రివర్గంలో మార్పులు లేదా స్వచ్ఛంద రాజీనామా అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం మొదలైంది. మరోవైపు కొండా మురళీధరావు కీలక వ్యాఖ్యలు చేయడం, తమ వైఖరిని స్పష్టం చేయడంతో ఈ ఎపిసోడ్ మరింత కాకరేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాల లోపే తుది నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న కొండా సురేఖ వ్యవహారంలో ఏఐసీసీ పెద్దల నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే హైకమాండ్ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత కేసీ వేణుగోపాల్‌.. సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన ఢిల్లీకి వచ్చిన తర్వాతే కొండా సురేఖ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్‌ రాక అనంతరం క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చ జరగనుంది. ఈ వ్యవహారంలో రాయబారం చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు భట్టి ఆసక్తి చూపలేదని సమాచారం. మరోవైపు.. క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేసీ వేణుగోపాల్‌ రాక తర్వాత కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. Konda Surekha, Bhatti Vikramarka, Telangana Congress Politics, Mallikarjun Kharge, AICC, Telugu News, Telugu one, KC Venugopal

Published on: Thu Aug 27, 2026 12:02PM

political-news-img

సాధిక్.. ద్వారంపూడి అనుచరుడా?

రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ ఏ మూలైనా సరే ఏదైనా ఒక ఘోరం జరిగితే, ఒక నేరం జరిగితే.. వాటి మూలాలు ఏపీలోని వైసీపీ పార్టీలో ఉంటాయన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నవే. ఇప్పుడు తాజాగా నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాకినాడ జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన కుటుంబ ఆత్మహత్య ఉదంతం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగి నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడటం వెనుక లవ్ జిహాద్, మతమార్పిడి ఒత్తిళ్లు, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ ఉన్నాయన్న ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి. ఈ కుటుంబం ఆత్మహత్యకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ అనే వ్యక్తికి వైసీపీతో సంబంధాలున్నాయన్న సంగతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వైసీపీ నాయకుడు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సాధిక్ అనుచరుడన్న వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాధిక్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సాధిక్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. సాధిక్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ హయాంలో సాధిక్ కు రాజకీయ అండదండలు పుష్కలంగా లభించాయని, ఆ అండదండలతోనే సాధిక్ ఇటువంటి అరాచకాలకు ఒడిగట్టాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భాధిత నూకరాజు కుటుంబాన్ని లవ్ జిహాద్ పేరుతో వేధింపులకు గురిచేసి, బలవంతపు మతమార్పిడికి ఒత్తిడి తీసుకురావడంతో ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే నూకరాజు కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు. గతంలో సాధిక్ ప్రారంభించిన ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవానికి కూడా మాజీ ఎమ్మెల్యే హాజరైనట్లు చెబుతున్నారు. దీనిపై కాకినాడ ఎంపీ, జనసేన నాయకుడు తంగెళ్ల శ్రీనివాస్ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌ను ఈ ఉదంతం వెనుక ఏకపక్ష వేధింపులే కాకుండా ఒక పెద్ద వ్యవస్థాగత రాకెట్ పనిచేస్తోందని ఎంపీ ఆరోపించారు. అమాయక కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ తరహా అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. Kakinada Family Suicide, Sadiq Controversy, Dwarampudi Chandrasekhar Reddy Link , Kakinada Love Jihad Case

Published on: Wed Aug 26, 2026 3:18PM

political-news-img

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కూతురి వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం : కొండా మురళి

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, పార్టీ మార్పుపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కొండా మురళి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు, మంత్రి కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్న వివాదాల వేళ ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం ముగిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కొండా మురళి పలు విషయాలపై ఓపెన్ అయ్యారు. గాంధీ కుటుంబంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నాయకత్వంలోనే తాము ముందుకు సాగుతామని పునరుద్ఘాటించారు. ఇటీవల తమ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సైతం ఆయన స్పందించారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆమె కేవలం 'ప్లాన్-ఎ' ప్రకారమే మాట్లాడిందని, అసలు ఆమె మనసులో ఉన్న 'ప్లాన్-బి' ఏంటో తనకు కూడా తెలియదని వ్యాఖ్యానించారు. మంత్రి కొండా సురేఖ కార్యకలాపాలపై మాట్లాడుతూ.. ఆమె ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని గుర్తుచేశారు. మంగళవారం జరిగిన వనమహోత్సవంతో పాటు బుధవారం నిర్వహించిన ఇతర అధికారిక సమావేశాల్లోనూ సురేఖ పాల్గొన్నారని తెలిపారు. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ కమిటీ సమక్షంలో ఉన్న అంశాలపై తాను స్పందించబోనని మురళి తెలిపారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ తుది నిర్ణయం వెలువరించేంత వరకు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగానే ఉంటానని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా కొండా సురేఖ వైఖరిపై పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ (డీఏసీ) ముందుకు కూడా ఈ అంశం వెళ్లడంతో అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకోబోతోందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ భేటీలు, సీనియర్ నేతల సంప్రదింపుల నేపథ్యంలో త్వరలోనే ఈ వివాదానికి తెరపడే అవకాశాలు కనిపించాయి. అధిష్టానం నిర్ణయం ఆధారంగా తదుపరి రాజకీయం ఎలా మారుతుందో వేచి చూడాల్సి ఉంది. Konda Murali, Konda Surekha, Telangana Congress News, Deputy cm Bhatti Vikramarka,TeluguOne News, CM Revanth reddy, Congress party, Minister Uttam Kumar Reddy, MLA Komatireddy Rajagopal Reddy

Published on: Wed Aug 26, 2026 3:12PM

political-news-img

ఏపీ స్థానిక ఎన్నికలు.. అందరి దృష్టీ పులివెందులపైనే.!

ఏపీలో స్థానిక ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రం అంతా ఒకెత్తు అయితే కడప జిల్లా అందులోనూ పులివెందుల మరో ఎత్తు అన్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ అడ్డా అయిన పులివెందుల మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వెస్తున్నది. అన్నిటికీ మించి ఈ సారి మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిన జరుగుతుండటంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఇక సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ లోకల్ బాడీ ఎన్నికలలో పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం కూటమి కూడా అలాగే పులివెందులలో జగన్ పునాదులు కదిలించాలన్న పట్టుదలతో ఉంది. అదే సమయంలో తన పట్టు నిలుపుకోవడానికి మజీ సీఎం, వైసీపీధినేత జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఇప్పటికే పులివెందుల మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ యువ నేత దుష్యంత్ రెడ్డిని బరిలోకి దింపనుంది. దుష్యంత్ రెడ్డి జగన్ కు సమీపబంధువు. ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలతో అనధికారికంగా ఎలక్షన్ క్యాంపెయి ప్రారంభించేసినట్ల తెలుస్తోంది. అయితే అదే సమయంలో తెలుగుదేశం కూటమి కూడా పులివెందులలో జగన్ పట్టుకు చెక్ పెట్టి మునిసిపాలిటీని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. పులివెందులతో బీటెక్ రవి తెలుగుదేశం కూటమి తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో పులివెందుల జెడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో బీటెక్ రవీ పకడ్బందీగా వ్యవహరించి.. తెలుగుదేశం అభ్యర్థిని మట్టి కరిపించి తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించడంలో కీలక పాత్ర వహించారు. అంతకు ముందు.. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీటెక్ రవి తన వ్యూహాలతో జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించగలిగిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన బీటెక్ రవి, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పులివెందులలో సత్తా చాటుతున్నారంటున్నారు. పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా సాధిస్తున్న ఆధిపత్యానికి గండి కొట్టడమే లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తుంటే.. వైసీపీ పట్టు నిలుపుకోవడానికి శాయశక్తులా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులివెందులలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. AP localbody Elections, Pulivendula Municipal Elections, YCP Candidate Dushyant Reddy, BTech Ravi TDP,Pulivendula Politics, Telugu News, TeluguOne

Published on: Wed Aug 26, 2026 2:53PM

political-news-img

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం : నారా లోకేష్

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్‌ మండలం నల్లంపల్లి వద్ద నిర్వహించిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయదుర్గం ప్రజలకు ప్రేమ, పౌరుషం, అభిమానం ఎక్కువే..! “విజయనగరం రాజుల మూడో రాజధాని రాయదుర్గం. రాయదుర్గం కోటలో ఎంత పౌరుషం ఉందో.. ఇక్కడి ప్రజల్లోనూ అంతే పౌరుషం ఉంది. ఇక్కడ పట్టు చీరలు, జీన్స్ ఎంత ఫేమసో.. మీ ప్రేమ, అభిమానం, స్టైల్ కూడా అంతే ఫేమస్. అవన్నీ ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. గత 11 ఎన్నికల్లో టీడీపీ కేవలం 4 సార్లు మాత్రమే గెలిచినా.. గెలిచినా, ఓడినా రాయదుర్గం నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓబుళాపురం గనుల పేరుతో అడ్డగోలుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పుడు కమిటీ వేసి ప్రజల తరఫున పోరాడింది టీడీపీ. నాడు మనం చేసిన పోరాటానికి ఫలితంగా తాజాగా తీర్పు వచ్చింది. ప్రజల కోసం పోరాడింది. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అధినేత. దేశంలో మరే రాజకీయ పార్టీ కల్పించని విధంగా కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్న పార్టీ టీడీపీ. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికే రూ.160 కోట్లు ఖర్చు చేశాం. కష్టపడి పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం కల్పించడమే మా లక్ష్యం” అని అన్నారు. మైటీడీపీ యాప్‌లో మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.. నేను పరిష్కరిస్తాను..! “యువగళం పాదయాత్రలో కార్యకర్తలను కలిసినప్పుడు.. “పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వండి.. మమ్మల్ని గుర్తించండి” అని చాలామంది కోరారు. అందుకే మైటీడీపీ యాప్‌ను తీసుకొచ్చాం. మీరు పాల్గొనే ప్రతి పార్టీ కార్యక్రమం, మీరు సొంతంగా చేపట్టే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే మైటీడీపీ యాప్‌లో ఫీడ్ చేయండి. క్లస్టర్, యూనిట్, బూత్ సమావేశాల్లో మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను మేము చదువుతున్నాం. మీరు చెప్పే సమస్యలు, సూచనలు మాకు చేరడం లేదనే అపోహ వద్దు. కొత్త పెన్షన్లు, ఇళ్లు ఇవ్వాలని కార్యకర్తలే ఫీడ్‌బ్యాక్‌లో కోరారు. కొత్త పెన్షన్ లు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది. ఇలా మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే నేను నిర్ణయాలు తీసుకుంటాను. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా గుర్తింపు దక్కుతుంది. మీరు మమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు.. మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం. కోటి మంది సభ్యులతో కూడిన కుటుంబం మనది. సముద్రం లాంటి ఈ కుటుంబంలో సమస్యలు సహజం. మనలో మనమే చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎక్కడైనా మీ సమస్య పరిష్కారం కాకపోతే మా దగ్గరకు రండి. మీకు అండగా నేను ఉంటాను. కార్యకర్తల కోసం, పార్టీ కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తాం” అని హామీ ఇచ్చారు. టీడీపీలో కార్యకర్తే అధినేత..! ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నియోజకవర్గానికి వెళ్లినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అనంతరం కార్యకర్తలను కలవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి కార్యకర్తతో మాట్లాడి, ఫొటో దిగి, వారి సమస్యలను తెలుసుకున్న తర్వాతే అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే విలువకు ఇదే నిదర్శనం. 2025 మహానాడులో ప్రవేశపెట్టుకున్న ఆరు శాసనాల్లో “కార్యకర్తే అధినేత” అనేది అత్యంత ముఖ్యమైనది. టీడీపీలో కార్యకర్తే అధినేత. అందుకే మహానాడు, అసెంబ్లీ, మండలి సహా పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కార్యకర్తలు ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి వేదికను పంచుకుంటున్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడం టీడీపీ బాధ్యత. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. పార్టీ కోసం ప్రాణాలు వదిలిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చట్టాన్ని సవరించి బిల్లు తీసుకొచ్చాం. వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు బిల్లును చట్టంగా చేసి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవానికి ఇదే నిదర్శనం. పులివెందుల ప్రజల కోసమైనా జగన్ అసెంబ్లీకి రావాలి..! “జగన్ ప్రెస్‌మీట్ పెడితే మనందరికీ పండగే. చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో ఆయన చెప్పే విషయం ఏమీ తెలియని వారికి కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. కానీ మాజీ సీఎం జగన్‌కు డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియదు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండూ ఒకటేనంటారు. జగన్ రెడ్డికి మరోసారి సవాల్ చేస్తున్నా. టైమ్, డేట్, లొకేషన్ నువ్వే ఫిక్స్ చేయి.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. అసెంబ్లీలోనూ ఎన్ని రోజులైనా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నా సవాల్‌ను స్వీకరించి ఎందుకు రావడం లేదు? ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించకుండా, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదనే వాస్తవం బయటపడుతుందనే భయమా? ప్రెస్‌మీట్లు ఎందుకు.. అసెంబ్లీకి రా! పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారి సమస్యలను అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించడం లేదు? రెండేళ్లలో జగన్ అసెంబ్లీకి వచ్చింది ఒక్కసారి మాత్రమే. అది కూడా ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. జగన్‌లా నేను కంచుకోటలో గెలిచిన వ్యక్తిని కాదు. 1988 తర్వాత టీడీపీ ఎప్పుడూ గెలవని మంగళగిరిలో తొలిసారి ఓడినా వెనక్కి తగ్గకుండా పోరాడి విజయం సాధించాను. కుప్పంలో పోటీ చేయమని చెప్పినా మంగళగిరిలోనే నిలబడి 91 వేల మెజార్టీతో గెలిచి ఆ విజయాన్ని చంద్రబాబు గారికి గిఫ్ట్ గా ఇచ్చాను. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటున్నాను. నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే.. పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి రా..!” అని సవాల్ విసిరారు. కూటమి ఐక్యతను కాపాడండి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం“కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి కూటమిలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన, బీజేపీ పేరుతో టీడీపీని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ల ప్రచారాన్ని నమ్మి ఆవేశపడకుండా కూటమి ఐక్యతను కాపాడాలి. మనమంతా ఐక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి కూటమి బలాన్ని మరింత పెంచాలి” అని పిలుపునిచ్చారు. కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది..! “మీ అభిమానానికి నేను ధన్యుడిని. యువగళం పాదయాత్రలో కణేకల్‌కు రాలేకపోయిన లోటు నేడు తీరిపోయింది. మీరు ఇచ్చిన ఘన స్వాగతం, చూపించిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. పట్టణ అధ్యక్షుడి ఆత్మీయ పలకరింపు నా గుండెను హత్తుకుంది. వీలైతే మీ ఇంటికి భోజనానికి వస్తాను. గతంలో కణేకల్‌కు సీఎం చంద్రబాబు గారు వచ్చినప్పుడు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయిలో జరగడం లేదు. కానీ కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది. నిధులు సమకూర్చే బాధ్యత మంత్రి కేశవ్ గారిది. రెండు సంవత్సరాల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయికి తీసుకెళ్లే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా జీ.లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, అనంతపురం పార్లమెంట్ ప్రెసిడెంట్ పూల నాగరాజు, అనంతపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జి.శ్రీధర్ చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు బి. గురప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Telugu Desam Party, Rayadurgam, Anantapur, Local Body Elections, TDP Cadre, Party Workers, My TDP App, TDP Alliance, CM Chandrababu Naidu, Andhra Pradesh Development, TDP Welfare, Kalyan Yojana, Political Alliance, Jana Sena, BJP, AP Politics

Published on: Tue Aug 25, 2026 8:11PM

political-news-img

ఏపీ స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా..? ప్రభుత్వానికి అసలైన పరీక్ష..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వానికి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లు, క్షేత్రస్థాయి పరిణామాలపై టోన్ న్యూస్ ప్రత్యేక చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ విశ్లేషణలో ప్రధాంశాలు..రాజకీయ పరిస్థితులు.. పట్టణ ఓటర్లు క్షేత్రస్థాయి అసంతృప్తిగ్రామీణ ప్రాంతాల ఎన్నికలతో పోలిస్తే పట్టణ ప్రాంత ఎన్నికలు పూర్తి భిన్నమైనవి. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు స్థానిక నాయకత్వం వ్యక్తుల ప్రాతిపదికన సాగుతాయి. కానీ, మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పార్టీ గుర్తులపై నేరుగా పోరు జరుగుతుంది. పట్టణాల్లోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు సంక్షేమ పథకాలపై పూర్తిగా ఆధారపడరు. వారు ప్రభుత్వ పాలనాతీరు, మౌలిక వసతులు, పారదర్శకతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు.ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసులలో అవినీతి విచ్చలవిడిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవన నిర్మాణ అనుమతుల నుంచి ఇతర చిన్న పనుల వరకు స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యం, వేధింపులు పెరిగాయనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో అవినీతి రహిత పాలన అని ప్రకటించినా, క్షేత్రస్థాయిలోని పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉండటం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. చంద్రబాబు వ్యూహం మౌలిక లోపాలుకూటమి ప్రభుత్వం తన ప్రధాన ఘనతలుగా పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని నిర్మాణం, పరిశ్రమల రాకను ప్రచారం చేసుకుంటోంది. అయితే ఈ వ్యూహంలో పలు రాజకీయ లోపాలు కనిపిస్తున్నాయి:అమరావతి కేంద్రీకరణ: అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడం ప్రాధాన్యమే అయినప్పటికీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల్లో ఇది అంతగా భావోద్వేగాన్ని కలిగించడం లేదు. సొంత నియోజకవర్గాల్లో రోడ్ల గుంతలు, మౌలిక వసతులు లేని స్థితిలో రాజధానిపైనే కోట్లు ఖర్చు చేయడం పట్ల కొంత వ్యతిరేకత వస్తోంది. పోలవరం పరిశ్రమలు: పోలవరం పనులు నెమ్మదించడం, పరిశ్రమల ఒప్పందాలు కేవలం ప్రకటనలకే పరిమితమై క్షేత్రస్థాయిలో ఉద్యోగావకాశాలుగా మారకపోవడం నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోంది. సంక్షేమం – ప్రచార లోపం: ప్రభుత్వం భారీ స్థాయిలో పెన్షన్లు (రూ. 4,000) ఇస్తున్నప్పటికీ, గత ప్రభుత్వంలో ఉన్నట్లుగా పథకాల సమర్థవంతమైన ప్రచారం, కచ్చితమైన అమల్లో లోపాలు కనిపిస్తున్నాయి. రైతాంగ సమస్యలు : కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల గురించి స్పష్టత ఇవ్వకపోవడం, పంట కొనుగోళ్లలో వ్యత్యాసాలు రైతుల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావంరాబోయే మున్సిపల్ ఎన్నికలు కూటమి ప్రభుత్వ పాలనకు తొలి ప్రాక్సీ టెస్ట్‌గా మారనున్నాయి. గతం కంటే మెరుగైన పాలన అందిస్తున్నామని నిరూపించుకోవడంలో వైఫల్యం చెందితే, పట్టణ ప్రాంతాల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పుంజుకునే అవకాశం ఉంది.శాసనసభ్యుల అవినీతిని అరికట్టడం, నిత్యావసరాలు మరియు మౌలిక వసతులపై దృష్టి సారించడం, పరిశ్రమలను త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావడంపై చంద్రబాబు నాయుడు తక్షణమే దృష్టి సారించాల్సి ఉంది. లేనిపక్షంలో, పట్టణ ఓటర్లు ఇచ్చే తీర్పు రాబోయే సాధారణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. AP Municipal Elections, CM Chandrababu Naidu Strategy, AP Politics Telugu, Amaravati Development, TDP vs YSRCP, AP Local Body Elections, AP Corruption Issues, AP Urban Elections, Polavaram Project Update, AP Welfare Schemes

Published on: Tue Aug 25, 2026 7:48PM