ఏపీ సర్కార్ చేసిన "చెత్తపని" పై కేంద్రం సీరియస్
Publish Date:Dec 26, 2020
Advertisement
ఏపీలోని జగన్ సర్కార్ రోజుకో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాలకు బ్యాంకులు నిధులు మంజూరు చేయడంలేదని పేర్కొంటూ.. బ్యాంకుల ముందు చెత్త పోయడాన్ని బ్యాంకర్లు సీరియస్ గా తీసుకుంటున్నారు. దీంతో వచ్చే సోమవారం నాడు ఏదో ఒక రూపంలో తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేయాలని వారు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరుల్లోని బ్యాంకుల గుమ్మం ముందు చెత్తను గుమ్మరించిన ఘటనపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే తీవ్రంగా స్పందించారు. ఈ విషయమై ఆమె ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో మాట్లాడినట్లుగా ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. బ్యాంకు గుమ్మాల ముందు చెత్తపోసిన ఫొటోలను కూడా ఆమె తన పోస్ట్ కు జత చేశారు. దీంతో ఈ విషయం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో "ఏపీలో ఇలా జరుగుతోందా" అంటూ బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఏపీ పరువు పోతున్నా జగన్ సర్కారు మాత్రం దీనిని తేలిగ్గానే తీసుకుంటోంది. అంతేకాకుండా రుణాలు అందని పథకాల లబ్ధిదారులే ఇలా నిరసన వ్యక్తం చేశారని ఉన్నతాధికారులు వాదిస్తున్నారు. అయితే కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరులలో ఒకేరోజు వివిధ బ్యాంకు శాఖల ముందు చెత్తపోయడం యాదృచ్ఛికంగా జరిగింది కాదని... "ఉన్నతస్థాయి" నుండి వచ్చిన ఆదేశాలను పాటించి మునిసిపాలిటీ పారిశుధ్య సిబ్బంది ఈ పని చేశారని బ్యాంకర్లు భావిస్తున్నారు. అంతేకాకుండా ఉయ్యూరులో ఏకంగా "నగరపంచాయతీ కమిషనర్" పేరిట బ్యానర్లు ఉంచడమే దీనికి నిదర్శనమని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, సీఎం స్వానిధి తదితర పథకాల విధివిధానాల్లో స్పష్టత లేకపోవడంతోపాటు, సిబ్బంది కొరత కారణంగానే రుణాలివ్వడంలో జాప్యం జరుగుతోందే తప్ప ఇందులో ఉద్దేశపూర్వక అలసత్వం ఏమాత్రం లేదని వివిధ సమావేశాల్లో స్పష్టం చేస్తున్నప్పటికీ ఇలాంటి చెత్త చర్యలకు పాల్పడటాన్ని బ్యాంకర్లు ఖండిస్తున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోనన్న ఆసక్తి ప్రస్తుతం నెలకొంది. క్రిస్మస్ సెలవుల తర్వాత ఏదో ఒక రూపంలో తమ నిరసనను వ్యక్తం చేయాలని బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు ఆలోచిస్తున్న నేపథ్యంలో.. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
http://www.teluguone.com/news/content/nirmala-sitharaman-responded-on-vuyyuru-bank-garbage-issue-39-108135.html





