మూసి ప్రక్షాళన.. ఎన్జీటీ పచ్చజెండా
Publish Date:Apr 3, 2026
Advertisement
హైదరాబాద్ నగరానికి జీవనాడిగా భావించే మూసి నది ప్రక్షాళన కార్యక్రమానికి అడ్డంకులు తొలగిపోయాయి. మాజీ మంత్రి సవితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ బుధవారం (ఏప్రిల్ 2) కీలక తీర్పు వెలువరించింది. మూసి శుద్ధి పనులను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌ను ట్రిబ్యునల్ కొట్టివేసింది. దీంతో మూసీ ప్రక్షాళనకు మార్గం సుగమ మైంది. మూసి నది ప్రక్షాళన లో ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు పాటించలేదంటూ కార్తీక్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ పరిసరాల్లో ముందస్తు అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని ఆయన ఆరోపించారు. పర్యావరణ ప్రభావం పై సరైన అధ్యయనం చేయ కుండా ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పనులను తక్షణమే నిలిపివేయాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయిం చారు.అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. మూసి ప్రక్షాళన నగర పర్యావరణానికి అత్యవసరమని, అన్ని అవసరమైన ప్రక్రియలను అనుసరించి పనులు చేపట్టామని ట్రిబ్యునల్ ముందు వివరించింది. పిటిషన్ రాజకీయ దురుద్దేశంతోనే దాఖలైందని ప్రభుత్వం వాదించింది. ప్రాజెక్టు ఆలస్యం అయితే నగర ప్రజలకు నష్టం జరుగుతుందని పేర్కొంది.ఇరు పక్షాల వాదనలు పరిశీలించిన ట్రిబ్యునల్, పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేనీ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనకు తగిన సాక్ష్యాలు సమర్పించ లేదని పేర్కొంటూ కార్తీక్ రెడ్డి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. మూసీ ప్రక్షాళన పనులను అడ్డుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది.ఈ తీర్పుతో మూసి ప్రక్షాళన కార్యక్రమం మరింత వేగం పుంజుకుంటుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/ngt-greensignal-to-musi-cleanising-36-216602.html





