ఆర్సీబీ ఆల్ రౌండ్ షో.. గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసి ఐపీఎల్ ఫైనల్స్ కు దూసుకెళ్లిన బెంగళూరు
Publish Date:May 26, 2026
Advertisement
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్స్ కు దూసుకెళ్లింది. మంగళవారం (మే 26) ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసి ఘనంగా ఫైనల్ లోకి అడుగు పెట్టింది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. అదే జోరును క్వాలిఫయర్ వన్ లోనూ కొనసాగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించి.. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వేగంగా పరుగులు సాధించారు. అయితే వెంకటేష్ అయ్యర్ 19 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన పడిక్కల్ కూడా వేగంగా పరుగులు చేశాడు. 30 పరుగులు చేసిన పడిక్కల్, 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా ఒకే ఓవర్ లో ఔటవ్వడంతో బెంగళూరు ఇబ్బందుల్లో పడినట్లు కనిపించింది. అయితే కెప్టెన్ రజిత్ పటిదార్, కృణాల్ పాండ్యా పరుగుల వేగం తగ్గకుండా ధాటిగా ఆడారు. ముఖ్యంగా పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. చేశాడు. ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో ఆర్సీబీ బ్యాటర్లు ఏకంగా 86 పరుగులు సాధించారంటే వారి బ్యాటింగ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక 255 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఐపీఎల్ 2026 సీజన్ ఆసాంతం మంచి ఫామ్ లో ఉండి పరుగుల వరద పారిస్తున్న గుజరాత్ ఓపెనర్లు సాయిసుదర్శన్, స్కిప్పర్ శుభమన్ గిల్ లు విఫలమయ్యారు. సాయిసుదర్శన్ దురదృష్టకర రీతిలో హిట్ వికెట్ గా వెనుదిరగగా, శుభమన్ గిల్ ను ఓ అద్భుతమైన బంతితో భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. ఇక మరో ఇన్ ఫామ్ బ్యాటర్ బట్లర్ ను హేజల్ వుడ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో గుజరాత్ ఇక కోలుకోలేకపోయింది. పవర్‌ప్లే ముగిసేసరికే గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక దశలో 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన గుజరాత్ ఆ తరువాత రాహుల్ తివాటియా ధాటిగా ఆడుతూ 69 పరుగులు చేయడంతో ఒకింత గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. గుజరాత్ 19.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయ్యి 92 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. అద్భుత బ్యాటింగ్ తో 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన బెంగళూరు స్కిప్పర్ రజిత్ పటిదార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
http://www.teluguone.com/news/content/--rcb-win-over-gt-36-220969.html




