తెలంగాణలో ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదు : మంత్రి దామోదర్
Publish Date:May 26, 2026
Advertisement
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోకి ఎబోలా ప్రవేశించకుండా శంషాబాద్ విమానాశ్రయంలోనే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రజారోగ్య రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎబోలా నివారణ, ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధతపై మంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎబోలా కేసులు లేవని అధికారులు మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద స్క్రీనింగ్, థర్మల్ స్కానింగ్ నిర్వహిస్తూ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. విమానాశ్రయంలో డాక్టర్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, ఫీల్డ్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బందితో ప్రత్యేక బృందం విధులు నిర్వహిస్తోందని అధికారులు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల కోసం 108 అంబులెన్సులను 24 గంటలపాటు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే గాంధీ హాస్పిటల్ లో 10 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ డాక్టర్ సునీల్ కుమార్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు. అనుమానితుల సాంపిల్స్‌ను పరీక్షించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కు పంపనున్నట్లు వెల్లడించారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చినప్పటికీ లక్షణాలు లేని ప్రయాణికులను 21 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. వీరిపై జిల్లా నిఘా బృందాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఈ నెల 25వ తేదీ నాటికి 58 మంది ప్రయాణికులు ఎబోలా ప్రభావిత దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు, అయితే వారిలో ఎవరికీ ఎబోలా లక్షణాలు లేవని వెల్లడించారు. వీరిని Category-I కింద వర్గీకరించి 21 రోజుల హోమ్ ఐసోలేషన్‌లో ఉంచామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రయాణికులను వెంటనే గాంధీ హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అప్రమత్తంగా ఉండాలని, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే విమానాశ్రయ అధికారులు, జిల్లా నిఘా బృందాలు, ఆస్పత్రుల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని సూచించారు.
http://www.teluguone.com/news/content/no-ebola-cases-have-been-reported-in-telangana-36-220966.html





