జీహెచ్ఎంసీలో దోమల ఫాగింగ్‌లో భారీ స్కామ్
Publish Date:Feb 24, 2026
Advertisement
హైదరాబాదు నగరంలో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న ఫాగింగ్ కార్యక్రమంలో భారీ అవినీతి వ్యవహారం బట్టబయలు అయింది. మల్కాజిగిరి సర్కిల్లో ఫాగింగ్ సిబ్బంది మధ్య పంపకాల విషయం లో తలెత్తిన విభేదాల కారణంగా ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజూ ఫాగింగ్ కోసం కేటాయించే డీజిల్‌ను పూర్తిగా వినియోగించ కుండా, పెద్ద మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతు న్నాయి.అధికారికంగా మల్కాజిగిరి సర్కిల్‌కు రోజుకు 84 లీటర్ల డీజిల్ కేటాయిస్తుండగా, వాస్తవంగా కేవలం 24 లీటర్లతో మాత్రమే ఫాగింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. మిగిలిన డీజిల్‌ను పెట్రోల్ బంక్‌లకు లీటర్‌కు పది రూపాయల కమీషన్ ఇచ్చి విక్రయించి, ఆ డబ్బులను ఎంటమాలజీ విభాగానికి చెందిన కొంతమంది సిబ్బంది స్వాహా చేసినట్లు సమాచారం. ఫాగింగ్ పనులు నిర్వహించే కార్మికులకు ప్రతినెలా ఐదు వేల రూపాయలు ఇచ్చి మిగతా మొత్తాన్ని సూపర్వైజర్, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) స్థాయి అధికారుల మధ్య పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఫాగింగ్ సిబ్బందికి ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేసిన లావాదేవీలు కూడా బయటపడినట్లు తెలిసింది. విషయం బయటకు రావడంతో సంబంధిత సూపర్వైజర్ను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించినట్లు సమాచారం. అయితే అవినీతి వ్యవహారాన్ని బయటపెట్టిన ఫాగింగ్ కార్మికుడిని ఇతర సిబ్బంది, ఎంటమాలజీ అధికారులు బెదిరించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సంవత్సరం దోమల నియంత్రణకు బల్దియా సుమారు రూ.32 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, నిధులు పక్కదారి పడుతున్న కారణంగా నగరవాసులు దోమల బెడద నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. డీజిల్ దుర్వినియోగం జరుగుతోందని గుర్తించిన అధికారులు గత మూడు నెలలుగా డీజిల్‌లో మెలాథియన్ రసాయనం కలిపి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీంతో డీజిల్‌ను విక్రయించే అవకాశం లేకపోవడంతో కొంతమంది సిబ్బంది ఫాగింగ్ చేయకుండా డ్రైనేజీల్లో పారబోస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో బల్దియా వర్గాల్లో కలకలం రేగింది. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో దోమల నియంత్రణకు ఖర్చు చేస్తున్న భారీ నిధులు నిజంగా వినియోగం అవుతున్నాయా అనే అంశంపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/mosquito-fogging-scam-in-ghmc-36-214620.html




