మండలిలో కవిత కన్నీళ్లు...అవినీతిని ప్రశ్నించినందున సస్పెండ్
Publish Date:Jan 5, 2026
Advertisement
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో, చిత్తశుద్ధితో నిర్వర్తించానని పేర్కొన్నారు. అయితే పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే తనను దారుణంగా అవమానించి బయటకు పంపారని కవిత మండలిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… “2004లో అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు వచ్చాను. 2006లో తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టాను. 2013–14లో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పే కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటారని పిలుపు రావడంతో 2013లో కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లాం. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత రెండు నెలలు గడిచినా కాంగ్రెస్ పెద్ద నాయకుల్లో ఎవరూ మమ్మల్ని పలకరించలేదు. అటువంటి సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సన్నిహితుడైన ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో ఉన్న పరిచయం వల్ల కేసీఆర్‌కు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగలిగాను. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావడంతో తెలంగాణ సాధన ముందుకు సాగింది” అని కవిత తెలిపారు. 2014లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని, ఆ తర్వాత నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీలో అవినీతిని ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టారని ఆరోపించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో తాను పోరాడుతున్న సమయంలో పార్టీ తనకు అండగా నిలవలేదని, కేసీఆర్‌పై కక్షతో బీజేపీ తనను జైలుకు పంపించినా పార్టీ ఆదుకోలేదని కవిత విమర్శించారు. “అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్ల వరకు అన్నిచోట్లా అవినీతి జరిగింది. సిద్ధిపేట, సిరిసిల్ల నిర్మించిన కలెక్టరేట్ ఒక్క వర్షానికే కొట్టుకుపోయింది. అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వాలని పార్టీ వేదికల్లో ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. కేసీఆర్‌ను ప్రశ్నించే ధైర్యం నాకే ఉంది. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదు. ఆ పరిశ్రమను తెరిపించలేకపోవడం నాకు అవమానకరం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌పై వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్‌లో పెద్ద నాయకులమని చెప్పుకునే వారెవరూ స్పందించలేదు. అందుకే ప్రెస్‌మీట్ పెట్టి బలంగా మాట్లాడాను. అవినీతిపరుల పేర్లను మీడియాకు వెల్లడించాను” అని కవిత తెలిపారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాలన్న నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని, పార్టీ పేరు మార్పు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. “తెలంగాణలో ఏం సాధించామో చెప్పకుండా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తామని చెప్పడం సరైంది కాదు” అంటూ కవిత తన ఆవేదనను వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/kavitha-emotional--36-212031.html





