నిఖిత హత్య కేసులో సంచలన విషయాలు
Publish Date:Jan 5, 2026
Advertisement
అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఎలికాట్ సిటీలో జరిగిన ఈ హత్య వెనుక డాలర్ల అప్పు లావాదేవీలు ఉన్నట్టు తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిఖితను హత్య చేసిన వ్యక్తి ఆమె స్నేహితుడు అర్జున్ శర్మేనని హోవార్డ్ కౌంటీ పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. అర్జున్ శర్మ నిఖిత వద్ద 4,500 డాలర్లు అప్పుగా తీసుకున్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని నిఖిత కజిన్ సరస్వతి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో వెల్లడించారు. అప్పు తీసుకున్న అర్జున్ శర్మ అందులో 3,500 డాలర్లు మాత్రమే తిరిగి ఇచ్చి, మిగిలిన 1,000 డాలర్లు ఇవ్వకుండా ఆలస్యం చేశాడని తెలుస్తోంది. ఈ విషయమై నిఖిత అతడిని పదే పదే డబ్బులు ఇవ్వాలని అడిగినట్టు సమాచారం. పోలీసుల విచారణలో మరో షాకింగ్ అంశం బయట పడింది. నిఖిత ఖాతా నుంచి 3,500 డాలర్లు అక్రమంగా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న అర్జున్ శర్మ, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదమే ఈ దారుణానికి దారి తీసిందని ప్రాథమికంగా తేలింది.డిసెంబర్ 31న డబ్బులు ఇస్తానని చెప్పి నిఖితను తన అపార్ట్ మెంట్‌కు పిలిపించిన అర్జున్ శర్మ, అక్కడే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. హత్య చేసిన వెంటనే అర్జున్ శర్మ అమెరికా నుంచి పారిపోయి భారత్‌కు వచ్చినట్టు గుర్తించారు.ఈ ఘటనపై నిఖిత తండ్రి ఆనంద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “అర్జున్ శర్మ మా అమ్మాయి స్నేహితుడు మాత్రమే. మాజీ ప్రియుడు అని మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఖిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తానని పిలిపించి మా కూతురిని అతని అపార్ట్‌మెంట్‌లో హత్య చేశాడు. ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు,” అని ఆయన కన్నీళ్లతో చెప్పారు.డిసెంబర్ 31న నిఖిత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ తెలిపిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హోవార్డ్ కౌంటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. జనవరి 2న నిఖిత ఆచూకీని గుర్తించినట్టు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. అర్జున్ శర్మ కొలంబియా ప్రాంతం లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్టు విచారణలో తేలింది.హత్య అనంతరం భారత్‌కు పారిపోయిన అర్జున్ శర్మను తమిళనాడులో అదుపులోకి తీసుకు న్నట్టు సమాచారం. ఈ కేసులో అమెరికా, భారత అధికారుల మధ్య సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయి. నిఖిత హత్య జరిగిన విషయాన్ని భారత రాయబారి కార్యాలయం కుటుంబ సభ్యులకు అధికారికంగా తెలియ జేసింది. నిఖిత మృతదేహాన్ని త్వరితగతిన హైదరాబాద్‌కు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తండ్రి ఆనంద్ విజ్ఞప్తి చేశారు. నిఖిత హత్యకు పాల్పడిన అర్జున్ శర్మకు అమెరికా ప్రభుత్వం కఠినమైన శిక్ష విధించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రవాస భారతీయులను తీవ్రంగా కలచివేసింది.
http://www.teluguone.com/news/content/nikhita-godishala-murder-36-212034.html





