కోనసీమలో బ్లో ఔట్.. వణికిపోతున్న జనం
Publish Date:Jan 5, 2026
Advertisement
కోనసీమలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఈ లేజీజ్ సంభవించింది. భారీ శబ్దంతో గ్యాస్ లీక్ అవుతుండటంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. భారీ స్థాయిలో గ్యాస్ లీక్ అవుతుండటం, మంటలు ఎగసిపడుతుండటంతో కోనసీమ వాసులు భయాందోళనలతో వణికి పోతున్నారు. మూడు దశాబ్దాల కిందటి బ్లో ఔట్ ను తలచుకుని ఆందోళనకు గురౌతున్నారు. సరిగ్గా 30 ఏళ్ల కిందట.. అంటే 1995 జనవరి 8న ఇదే కోనసీమలో సంభవించిన భారీ బ్లో ఔట్ ను గుర్తు తెచ్చుకుని వణికి పోతున్నారు. అప్పట్లో కోనసీమ లోని మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామం వద్ద ఓఎన్జీసీ రిగ్గు లీకై భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి. ఆ మంటల ధాటికి ఆ పరిసర ప్రాంతాల్లోని పచ్చదనమంతా మాడి మసైపోయింది. కొబ్బరి చెట్లు దగ్ధమైపోయాయి. జనవరి 8న జరిగిన ఆ బ్లోఔన్ మార్చి 15 నాటికి కానీ అదుపులోకి రాలేదు. అప్పట్లో సంభవించిన ఆ బ్లో ఔట్ ప్రపంచ బ్లో ఔట్ ల చరిత్రలోనే రెండో అతి పెద్ద బ్లో ఔట్ గా చరిత్ర సృష్టించింది. ఆ బ్లో ఔట్ కారణంగా భారీ నష్టం సంభవించింది. దాదాపు రెండు నెలలకు పైగా ఆ మంటల వేడికి పాశర్లపూడి పరిసర గ్రామాల ప్రజలు మగ్గిపోయారు. పొలాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇప్పుడు మళ్లీ భారీగా ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో కోనసీమ వాసులు నాటి రోజులను జ్ణప్తికి తెచ్చుకుని భయంతో వణికిపోతున్నారు. ఓఎన్జీసీ అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ లీకేజీని అరికట్టి మంటలను ఆర్పివేయాలని కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/blowout-in-konaseema-36-212028.html





