రెండాకుల పార్టీని… పువ్వు పార్టీ… హైజాక్ చేసేసిందా?
Publish Date:Apr 18, 2017
Advertisement
ఒకప్పుడు ఛాయ్ అమ్ముకున్నాడని చెప్పే పన్నీర్ సెల్వం… మరో వైపు దేశాన్నే ముందుకు దూకిస్తున్న అసలు సిసలు ఛాయ్ వాలా మోదీ… ఆయన అభిప్రాయాలకు, అంచనాలకు అనుగుణంగా నడుచుకునే అపర చాణక్యుడు, పక్కా గుజరాతీ పొలిటికల్ కిల్లర్ అమిత్ షా! వీళ్లు చాలరన్నట్టు ఇప్పుడు స్వంత వర్గంగా వుంటూ వచ్చిన పళనిస్వామి కూడా రివర్స్ అయిపోయాడు శశికళ అండ్ దినకరణ్ లకు! రాజకీయంలో, రౌడీయిజంలొ తమకు ఎదురులేదనుకున్న మన్నార్ గుడి మాఫియా ఇప్పుడు విలవిలలాడిపోతోంది! రెండాకుల పార్టీని తమ గుత్త సొత్తని భావించిన శశి వర్గం ఇప్పుడు మోదీ నుంచీ పన్నీర్ దాకా అందరూ ఏకమై పావులు కదిపే సరికి… వారంతా తమ కంటే రెండాకులు ఎక్కువే చదివారని అర్థం చేసుకుంటోంది! జయ బతికి వున్నప్పుడు అమ్మ చాటు బిడ్డల్లా బతికిన శశికళ, ఆమె కుటుంబం ఇప్పుడు నిజమైన కరుడుగట్టిన పాలిటిక్స్ వేడిని అనుభవిస్తున్నారు. అతి తెలివికిపోయి జైలుకి వెళ్లేలోగానే సీఎం అవ్వాలని కలలుగన్న చిన్నమ్మ ఇప్పుడు జైల్లో సామాన్య ఖైదీగా వుంది. మరో వైపు ఆమె నియమించిన ఆమె ఉప ప్రధాన కార్యదర్శి దినకరణ్ ఈసీకే లంచం ఇవ్వజూపిన కేసులో ఇరుక్కున్నాడు. ఇక అరెస్ట్ ఒక్కటే మిగిలి వుంది. అన్నిటికంటే ఆందోళనకరంగా, శశికళ నమ్మి ముఖ్యమంత్రిని చేసిన ఈ. పళనిస్వామి పన్నీర్ సెల్వంతో చేతులు కలిపాడని టాక్! శశికళ, దినకరణ్ జైళ్లలో వుండగానే అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఏకమై మళ్లీ ఒకే పార్టీగా అవతరించాలనుకుంటున్నాయట! అదే జరిగితే పళని స్వామీ ఆకు ఒకటి, పన్నీర్ సెల్వం ఆకు ఒకటి కలిసి… రెండాకుల ఏఐఏడీఎంకే ప్రతిష్ఠాత్మక ఎన్నికల గుర్తు గొడవ తీరిపోయినట్టే! రెండాకుల గుర్తు తాను ఉప ప్రధాన కార్యదర్శిగా వున్న అన్నా డీఎంకే వర్గానికి చెందేలా దినకరణ్ పావులు కదిపాడు. అందుకోసం, అరవై కోట్లు లంచం ఇవ్వటానికి కూడా సై అన్నాడు. ఇదంతా ఎందుకూ అంటే.. ఆ రెండాకుల గుర్తు వుంటేనే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఓట్లు పడతాయి. దినకరణ్ గెలుస్తాడు! కాని, కేంద్రంలో వున్న మోదీ సర్కార్ తమకంటే రెండాకులు ఎక్కువే రాజకీయం చదివిందని దినకరణ్ గ్రహించలేకపోయాడు. మొదట్నుంచీ శశికళ బ్యాచ్ వారి రౌడీ రాజకీయాలకి వ్యతిరేకంగా వుంటూ వస్తోన్న ఢిల్లీ ప్రభుత్వం పకడ్బందీగా లంచం కేసులో ఇరికించేసింది దినకరణ్ ని! ఇక ఇప్పుడు ఆయన ఎంతో ఎక్కువ సేపు జైలు బయట వుండే పరిస్థితులు లేవు. మరి ఆయన కూడా శశికళ బాటలోనే జైలుకి వెళితే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం రెండు వర్గాలుగా వున్న ఈపీఎస్, ఓపీఎస్ పార్టీలు శశికళ , దినకరణ్ ల బెదిరింపులు లేకపోతే తక్షణం ఏకమైపోతాయి. ఇది పెద్దగా ఆశ్చర్యకరం కాదు. అసలు కథంతా ఆ తరువాతే వుండనుంది. ఇప్పుడు తెర వెనుక నుంచి డ్రామా నడిపిస్తోన్న బీజేపి పెద్దలు ముందు ముందు నేరుగానే ఎంట్రీ ఇవ్వొచ్చు. జయలలిత లాంటి కరుడుగట్టిన నేత లేకుండా స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేను ఎదుర్కోవటం చాలా కష్టం. కాబట్టి పన్నీర్ సెల్వం, పళని స్వామి వచ్చే ఎన్నికల లోపు తమ ఎమ్మేల్యేలు, మంత్రులు, కార్యకర్తలు అందరితో సహా కమల కండువాలు కప్పుకోవచ్చు! అన్నాడీఎంకే ఒక చరిత్రగా మిగిలిపోయి బీజేపి తమిళనాడులో ప్రధాన పక్షంగా ఎదగవచ్చు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక విలీనం జరగకున్నా… సగానికి సగం సీట్లు పంచుకుని వచ్చే ఎన్నికల్లో బీజేపితో పొత్తు పెట్టుకోవటం మాత్రం అన్నాడీఎంకేకి తప్పనిసరి. కారణం కేంద్రంలోని సర్కార్ నుంచి నిధులు రాకుండా పన్నీర్ కాని, పళని కానీ ఏం చేయలేని పరిస్థితి వుంది. అలాగే, స్టాలిన్ రాజకీయాన్ని ఎదుర్కోవటం కూడా మోదీ, అమిత్ షా లాంటి వారి నాయకత్వంలో ముందుకు సాగితేనే వీలవుతుంది. ఈ కాలిక్యులేషన్స్ అన్నిట్నీ చూపిస్తూ కొందరు రాజకీయ పండితులు ముందు ముందు తమిళనాడు కాషాయమయం అవకాశాలు లేకపోలేదంటున్నారు!
http://www.teluguone.com/news/content/jayalalitha-45-74034.html





