దేవినేని నెహ్రూకి, దేవినేని ఉమకి ఎందుకు పడదు
Publish Date:Apr 17, 2017

Advertisement
తండ్రి కొడుకులయినా...అన్నాదమ్ములనైనా బద్ధ శత్రువులుగా చేసే శక్తి రాజకీయానికి ఉందంటారు..ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది. ఆ కోవలోకే వస్తారు దేవినేని బ్రదర్స్. దేవినేని అనగానే గుర్తొచ్చే పేర్లు నెహ్రూ..ఉమా..ఇద్దరు అన్నదమ్ములే..కానీ ఒకరంటే ఒకరికి పడదు..ఎందుకు..? వీరి మధ్య ఇంతటి వైరానికి కారణం ఏంటి..? అంటే సవాలక్ష కారణాలు కనిపిస్తాయి. కృష్ణాజిల్లా రాజకీయాల్లోనే కాదు..ఏపీ రాజకీయాల్లోనూ దేవినేని కుటుంబానిది కీలక పాత్ర..దశాబ్దాలుగా ఆ కుటుంబం ప్రజాసేవలోనే కొనసాగుతుంది. ముఖ్యంగా దేవినేని నెహ్రూ టీడీపీ ఆవిర్భావ సభ్యుడు..ఆయన ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు ..ఎన్టీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నెహ్రూ వెన్నంటే ఆయన బాబాయి కుమారులు దేవినేని వెంకట రమణ, దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశంలో కీలక నేతలుగా ఎదిగారు.
అయితే ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబుతో మనస్పర్థలు రావడంతో నెహ్రూ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలోనూ తన సత్తా చాటిన నెహ్రూ అక్కడా కీలకనేతగా ఎదిగారు. అయితే ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయన్నట్లు, ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్ నేతలకు రాజకీయ సమాధి కట్టింది. అలాంటి నేతల్లో నెహ్రూ కూడా ఒకరు. మరో పక్క నెహ్రూ సోదరుడు దేవినేని ఉమ టీడీపీలో చక్రం తిప్పుతూ, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఒక వెలుగు వెలుగుతున్నారు. అయితే పార్టీలు వేరైనా, ఎప్పుడూ అన్నదమ్ములిద్దరూ మాటా మాటా అనుకున్నది లేదు..కానీ పట్టిసీమ ప్రాజెక్ట్ వీరి మధ్య దూరాన్ని పెంచింది. తన ఇంటి పక్కన వెళుతున్న బుడమేరు కాలువలోకి భలేరావు చెరువులోని నీరు తీసుకువచ్చి అవి పట్టిసీమ నీరు అని ఉమా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ నెహ్రూ సెటైర్ వేశారు. పైగా తన ఇంటి పేరే ఉమకి ఉండటం తనకు అవమానంగా ఉందని ఘాటైన వ్యాఖ్య చేశారు.
ఈ వ్యాఖ్యలు ఉమకి ఆగ్రహం తెప్పించాయి. అన్న అని మర్యాద ఇస్తే ఆగడాలు ఎక్కువయ్యాయంటూ ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా తాను కాకుండా తన అనుచరులతో మాటల తూటాలు పేల్చారు. అయితే ఎంతలా కృష్ణాజిల్లాను శాసిస్తున్నా..మంత్రిగా అధికారాన్ని గుప్పెట పెట్టుకున్నా..నెహ్రూకి జనంలో ఉన్న ఛరిష్మా ఉమకు లేదూ అంటుంటారు..ముఖ్యంగా దేవినేని అంటే ముందుగా గుర్తొచ్చేది నెహ్రూనే..చాలా సందర్భాల్లో అన్నయ్యకి ఎదురువస్తే ఉమ పక్కకు తప్పుకునేవాడు కానీ..కనీసం తలెత్తి మాట్లాడేందుకు కూడా భయపడేవాడని టీడీపీ వర్గాల్లో టాక్. అంతటి ఛరిష్మా ఉంది గనుకనే చంద్రబాబు సైతం పాత గొడవలు పక్కనబెట్టి నెహ్రూని టీడీపీలోకి ఆహ్వానించారు. అయితే నెహ్రూ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న సమయంలోనూ ఆయన రాకను ఉమ అడ్డుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్నయ్య వస్తే కృష్ణాజిల్లాలో తన ప్రాధాన్యత తగ్గుతుందోనన్న భయం కావొచ్చు..మరేదైనా కానీ నెహ్రూని టీడీపీలోకి రానివ్వద్దంటూ అధినేతకు తేల్చి చెప్పాడని పసుపు కండువాలు గుసగుసలాడుకున్నాయి. అయినా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నెహ్రూని తెలుగుదేశంలోకి ఆహ్వానించారు చంద్రబాబు.
ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. ఇద్దరూ మళ్లీ కలుసుకుంటారు అనుకున్న సమయంలో నెహ్రూ హఠాన్మరణం టీడీపీ కార్యకర్తలను కలచివేసింది. అటు ఉమా కూడా అన్నయ్య మరణవార్త వినగానే కుప్పకూలిపోయారు. నెహ్రూ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.
http://www.teluguone.com/news/content/devineni-nehru-death-45-74030.html












