బెంగాల్ ఎన్నికలు 2026.. ముస్లిం వీటో ఒక భ్రమ మాత్రమేనా?
Publish Date:Apr 19, 2026
Advertisement
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో ముస్లిం ఓటు బ్యాంక్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా బెంగాల్ ఎన్నికల విశ్లేషణలు అనగానే ముస్లింల ఓట్ల ఏకీకరణ (ముస్లిం ఓట్ కన్సాలిడేషన్) అనే అంశం ప్రధానంగా వినిపిస్తుంది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాల్లో 80 నుండి 120 సీట్ల భవితవ్యాన్ని ముస్లి మైనారిటీ ఓటర్లే శాసిస్తారనేది రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్న నమ్మకం. అయితే.. గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది. . జనాభా లెక్కల ప్రకారం బెంగాల్ లో ముస్లిం జనాభా సుమారు 27 శాతంగా ఉంది. కానీ ఈ జనాభా రాష్ట్రమంతటా సమానంగా విస్తరించి లేదు. మొత్తం 23 జిల్లాల్లో ముస్లింలు మెజారిటీగా ఉన్నది కేవలం మూడు జిల్లాల్లోనే. ముర్షిదాబాద్ లో 66శాతం, మాల్దా జిల్లాలో 51శాతం, ఉత్తర్ దినాజ్పూర్ జిల్లాలో 50 శాతం ముస్లిం జనాభా ఉంది. ఈ మూడు జిల్లాలూ వినా మిగిలిన 20 జిల్లాల్లో హిందువుల జనాభాయే అత్యధికంగా ఉంది. అంటే రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 251 అసెంబ్లీ స్థానాల్లో హిందువులే మెజారిటీగా ఉన్నారు. రాజకీయంగా ప్రచారం పొందుతున్నట్లుగా 80కి పైగా సీట్లలో ముస్లిం ఓటర్లే విజేతలను నిర్ణయిస్తారనే లెక్క తప్పడానికి కారణమేంటంటే.. జిల్లా స్థాయి జనాభా శాతాన్ని నేరుగా నియోజకవర్గాలకు వర్తింపజేయడమే. ఎన్నికల వ్యవస్థలో ఫలితాన్ని ఏకపక్షంగా ప్రభావితం చేయాలంటే ఒక నియోజకవర్గంలో ఒక వర్గం ఓట్లు కనీసం 38 నుండి 40 శాతం పైగా ఉండాలి. ఈ ప్రాతిపదికన చూస్తే, ముర్షిదాబాద్ లో 20, మాల్దాలో 8, ఉత్తర్ దినాజ్పూర్ లో 5 స్థానాలతో పాటు మిగిలిన జిల్లాల్లోని కొన్ని పాకెట్లను కలుపుకున్నా, ముస్లిం ఓటు నిర్ణయాత్మకంగా ఉండే సీట్లు 47 నుండి 54 మధ్య మాత్రమే ఉంటాయి. ఇది మొత్తం రాష్ట్రంలోని సీట్లలో కేవలం 16 నుంచి 18 శాతం మాత్రమే. అంటే, ముస్లిం ఓటు ఒక పార్టీకి ఎన్నికల రేసులో కొంత ముందంజ (హెడ్ స్టార్ట్) ఇవ్వగలదే తప్ప.. రాష్ట్రవ్యాప్తంగా విజయావకాశాలను శాసించే వీటో శక్తి కాదని అవగతమౌతుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఓట్ల వృథా. ముస్లిం ఓట్లు ఎక్కువగా కేంద్రీకృతమైన సుజాపూర్ వంటి నియోజకవర్గాల్లో గత ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచింది. అయితే.. ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ విధానంలో గెలవడానికి అవసరమైన దానికంటే ఎక్కువగా వచ్చే ఈ లక్షలాది ఓట్లు సభలో ప్రతినిధుల సంఖ్య పెంచడానికి ఉపయోగపడవు. అలాగని ఈ ఓట్లు ఇతర నియోజకవర్గాలకు బదిలీ కావు, కాబట్టి ఇవి కేవలం సంఖ్యాపరంగా పెద్ద మెజారిటీలుగానే మిగిలిపోతాయి తప్ప సీట్ల సంఖ్యను పెంచవు. దీనికి విరుద్ధంగా, 2021 ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించిన కీలకమైన 13 సీట్లు ముస్లిం ప్రాబల్యం లేని ప్రాంతాల్లోనే ఉన్నాయి, అక్కడ మెజారిటీ 3,000 ఓట్ల కంటే తక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పుడు.. 2026 ఎన్నికలలో ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు అత్యంత కీలకం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 91 లక్షల ఓటర్ల తొలగింపు జరిగింది, అంటే సగటున ప్రతి నియోజకవర్గంలో 31,000 ఓట్లు తగ్గాయి. గత ఎన్నికల్లో అనేక సీట్లలో విజేతలకు వచ్చిన మెజారిటీలు 50వేల లోపే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఓటర్ల జాబితా సవరణ (సర్) ఏ సామాజిక వర్గంపై లేదా ఏ పార్టీ మద్దతుదారులపై ఎక్కువ ప్రభావం చూపిందనేది రాబోయే ఎన్నికల ఫలితాలను నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేవలం ముస్లిం ఓట్ల ఏకీకరణపైనే దృష్టి పెట్టడం కంటే, ఈ సూక్ష్మ స్థాయి మార్పులను గమనించడం అవసరం. ఎ:దుకంటే.. పోలరైజేషన్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ముస్లిం ఓట్లు ఒక పార్టీ వైపు 100 శాతం మొగ్గు చేపితే.. , అది మిగిలిన హిందూ మెజారిటీ సీట్లలో హిందూ ఓట్ల పోలరైజేషన్ కు దారి తీస్తుంది. అయినప్పటికీ.. అన్ని రాజకీయ పార్టీలు ఈ ముస్లిం వీటో కథనాన్ని ప్రచారం చేయడానికే ఇష్టపడుతున్నాయి. అధికార టీఎంసీ మైనారిటీలకు రక్షకుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి, బీజేపీ హిందూ ఓట్లను సమీకరించడానికీ, ఐఎస్ఎఫ్ వంటి పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే దీనిని వాడుకుంటున్నాయి. ఇక చివరిగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముఖచిత్రం సాధారణంగా అనుకునే మతపరమైన సమీకరణాల కంటే చాలా లోతైనది. ముస్లిం ఓటర్ల పాత్ర ముఖ్యమైనదే.. అయినా, అది కేవలం కొన్ని జిల్లాలకే పరిమితం. అసలైన ఎన్నికల పోరాటం మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతాల్లో, స్వల్ప మార్జిన్ సీట్లలో మాత్రమే ఉంటుంది. 2026 లో బెంగాల్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనేది కేవలం ఒక వర్గం ఓట్లపైనే కాకుండా, ఈ క్లిష్టమైన క్షేత్రస్థాయి సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. -సీతారాం కంఠంనేని
http://www.teluguone.com/news/content/is---muslim-veto--merely-an-illusion-45-217718.html




