ఎన్నికల్లో హామీలు... ఎదురుచూపుల్లో జనాలు… మధ్యలో కోర్టులు!
Publish Date:Apr 18, 2017
Advertisement
ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు సాధారణంగా అమలుకు నోచుకోవు. వాట్ని ఖచ్చితంగా అమలు చేయాలన్న రూల్ కూడా లేదు. అందుకే, ఎన్నికల మ్యానిఫెస్టోలోని దాదాపు 90శాతం హామీలు మళ్లీ ఎన్నికల నాటికి నిక్షేపంగా వుండిపోతాయి. అవే హామీల్ని అదే పార్టీ తిరిగి వల్లెవేయటమో, లేదా గతంలో వ్యతిరేకించిన పార్టీ ఇప్పుడు సమర్థించి తాము అమలు చేస్తామని చెప్పటమో జరుగుతూ వుంటుంది! కాని, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కి ఎన్నికల హామీలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఎలక్షన్స్ టైంలో చెప్పని పనులు చకచకా జరిగిపోతోన్న చెప్పినవి మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి! అసెంబ్లీలో ముస్లిమ్ , ఎస్టీ రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసిన కొన్ని గంటల్లోనే సుప్రీమ్ కోర్టులో టీఆర్ఎస్ కు చుక్కెదురైంది. అయితే, ఈ తీర్పు రిజర్వేషన్ల గురించి కాదు. సింగరేణి వారసత్వ నియామకాలపై! ముందు ముందు మత ఆధారిత రిజర్వేషన్ల అంశం కూడా ఎలా కొనసాగబోతోందో ఈ తీర్పే తేల్చి చెప్పేస్తోంది! అసలు ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకి… వారసత్వ ఉద్యోగాలకి సై అంటాం… అని హామీ ఇచ్చే ముందు కేసీఆర్ ఆలోచించుకున్నారా? కోర్టుల్లో ఎలాంటి చిక్కులు ఎదురవుతాయి అని అంచనా వేశారా? పరిస్థతి చూస్తుంటే అలాంటిదేం జరగలేదనిపిస్తోంది! ఎప్పుడో ఆపేసిన వారసత్వ ఉద్యోగాల్ని పునరుద్ధరిస్తామని టీఆర్ఎస్ ఎలక్షన్స్ కి ముందు హామీ ఇచ్చింది. దాదాపు 25 నియోజకవర్గాలు, 3 లోక్ సభ స్థానాల్ని గెలిపించటంలో సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం. అందుకే, గులాబీ పార్టీ రిస్క్ చేసి మాటిచ్చింది. అనుకున్నట్టే గెలిచింది. కానీ, ఇప్పుడు హామీని అమలు చేద్దామంటే కుదరటం లేదు. హైకోర్ట్ తో బాటూ అత్యున్నత న్యాయస్థానం కూడా వారసత్వంగా ఉద్యోగం ఇవ్వటానికి వీలులేదని తేల్చేసింది. నిజంగా కూడా లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంటే పదవి విరమణ చేసిన వారి సంతానానికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? తగిన పరీక్ష, ఇంటర్వ్యూ లాంటివి జరిగాకే అర్హులకి ఉద్యోగం దక్కాలి. కోర్టులు చెబుతోంది అదే! గవర్నమెంట్ ఉద్యోగం చేస్తోన్న వారి వ్యక్తిగత ఆస్తి కాదు కదా… వారసత్వ ఉద్యోగాల మంచి , చెడులు పక్కన పెడితే అసలు ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో పార్టీలు , నాయకులు పాటించాల్సిన నియంత్రణ అంటూ ఏం లేదా? ప్రజలు నమ్మి ఓట్లు వేశాక తీరా కోర్టులు అడ్డుపడితే రాజకీయ పక్షాలు చేతులెత్తేసి తప్పించుకునే అవకాశాలే ఎక్కువ! తెలంగాణలో ఇప్పుడు సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, ముస్లిమ్ రిజర్వేషన్ల విషయంలో అదే జరిగేలా కనిపిస్తోంది. పట్టుదలగా కేసీఆర్ ఎన్నికల హామీల్ని ఏదో ఒక విధంగా అమలు చేస్తే తప్ప కోర్టుల అడ్డంకుల్ని దాటుకుని ఈ నిర్ణయాలు కార్యరూపం దాల్చే అవకాశం లేదు!
http://www.teluguone.com/news/content/kcr-45-74036.html





