హైదరాబాద్‌లో గుజరాత్ పోలీసుల సోదాలు .. చిన్నారుల అక్రమ రవాణా నెట్‌వర్క్ బట్టబయలు
Publish Date:Apr 30, 2026
Advertisement
చిన్నారుల అక్రమ రవాణా కేసులో గుజరాత్ పోలీసులు మళ్లీ హైదరాబాదు నగరానికి వచ్చి భారీ సోదాలు నిర్వహించడం నగరంలో కలకలం రేపింది. ఈ కేసులో కీలక నిందితుడిగా గుర్తించిన మురుగన్ ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించిన అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను మురుగన్ నిర్మించినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ పోలీసులు మురుగన్‌కు సంబంధాలున్నట్లు భావిస్తూ హైదరాబాద్ లోని మూడు ఫెర్టిలిటీ సెంటర్లపై దాడులు నిర్వహించారు, 49ఐవీఎఫ్, సికింద్రాబాద్ హెగ్డే ఐవీఎఫ్, బంజారా హిల్స్, నోవా ఐవీఎఫ్, కూకట్‌పల్లిలకు మురుగన్ తో సంబంధాలపై ఈ సోదాలు జరిగాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, రికార్డులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది చైతన్యపురిలో వెలుగులోకి వచ్చిన కేసులో మురుగన్ పేరు మొదట బయటపడింది. ఆ సమయంలో మూడు నెలలు జైల్లో గడిపి బయటకు వచ్చిన అతను మళ్లీ అక్రమ కార్యక లాపాలను కొనసాగించినట్లు పోలీసులు చెబుతున్నారు. మురగన్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఏడాదిలో దేశవ్యాప్తంగా సుమారు పాతిక మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మురుగన్ గ్యాంగ్ గుజరాత్ పోలీసుల అదుపులో ఉంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని పేర్లు, మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/gujarat-police-raids-in-hyderabad-36-218632.html





