సగర్వంగా నిల‘బడి’.. టెన్త్‌లో ప్రభుత్వ స్కూళ్ల ఘనత
Publish Date:May 1, 2026
Advertisement
మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది. వార్తా పత్రికల ఫస్ట్ పేజీలో కార్పొరేట్ స్కూళ్ల ప్రకటనలు కనిపించడం సహజం. తమ స్కూల్ విద్యార్థులు సాధించిన మార్కులు, వచ్చిన ర్యాంకులతో యజమాన్యాలు ఫుల్ పేజీ యాడ్స్ ఇస్తుంటాయి. అయితే ఈసారి ఏపీలో టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చాక సరికొత్త ట్రెండ్ కనిపించింది. ఏపీ ప్రభుత్వమే పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ.. సర్కారు బడుల్లో చదివి స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఫొటోలను ప్రచురించడం విశేషం ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలను గురువారం వెల్లడించారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం టెన్త్ క్లాసులో 85.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు సైతం కార్పొరేట్ స్కూళ్లలో చదువుతూన్న విద్యార్థులకు ధీటుగా మార్కులు సాధించారు. దీంతో ఏపీ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ.. సగర్వంగా నిల‘బడి’ అంటూ.. ప్రభుత్వ బడులను ప్రమోట్ చేస్తూ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. సర్కారు బడుల్లో చదివినప్పటికీ స్టేట్ ర్యాంక్ స్థాయి మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థుల ఫొటోలు, వారు సాధించిన మార్కులు, చదువుకున్న పాఠశాల వివరాలను ఈ ప్రకటనలో ప్రచురించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన నలుగురు విద్యార్థినులకు ఏకంగా 596 మార్కులు రాగా.. 9 మంది 595 మార్కుల చొప్పున సాధించడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారిలో 13 మంచి ర్యాంకులు సాధిస్తే.. అందులో 12 మంది బాలికలే కావడం విశేషం. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ.. ఇందుకు కారణమైన టీచర్లు, సిబ్బందికి విద్యాశాఖ ధన్యవాదాలు తెలిపింది. ‘అమ్మలా శిక్షణ.. నాన్నలా రక్షణ.. స్నేహపూర్వక బోధన.. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించండి.. వారి బంగారు భవితకు బాటలు వేయండి’ అని ఏపీ విద్యా శాఖ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి, విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (ఎల్ఈఏపీ) లాంటి కొత్త ప్రాజెక్టులతో విద్యా రంగం స్వరూపాన్ని మార్చేస్తోంది. విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ, డిజిటల్ టూల్స్ వినియోగంపై వర్క్ షాప్‌లు నిర్వహిస్తున్నారు. 2029 నాటికి విద్యారంగంలో ఏపీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు పని చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/education-minister-nara-lokesh-36-218755.html





