ఫార్ములా ఈ రేస్ కేసు.. ఐఏఎస్ అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు?!
Publish Date:Feb 28, 2026
Advertisement
ఫార్ములా ఈ రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌పై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటకు రెడీ అయ్యింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం (ఫిబ్రవరి 26) రాత్రి ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ బదలీల్లో భాగంగా రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను కూడా బదలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది. తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటుకు రెడీ అయ్యింది. అరవింద్ కుమార్ సస్పెషన్ ఫైలుపై సీఎం సంతకం కూడా చేసేశారనీ, ఇహనో, ఇప్పుడో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాల విశ్వసనీయ సమాచారం. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అర్వింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి లభించిన కొన్ని రోజులకే రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటుకు సిద్ధపడటం ప్రాధాన్యత సంతరించుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అర్వింద్ కుమార్ ఉన్న సమయంలోనే ఫార్ములా ఈ రేసు కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నుంచి దాదాపు రూ.55 కోట్లను రాష్ట్ర కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా బదిలీ చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, అర్వింద్ కుమార్‌ను ఏ-2గా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి ప్రాసిక్యూషన్‌కు అనుమతులు రావడంతో, ఏసీబీ త్వరలోనే ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగానే అర్వింద్ కుమార్‌ను సస్పెడ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/farmula-e-race-case-36-214788.html





