సరిహద్దుల్లో ఎన్నికల సెగ.. అడుగడుగునా నిఘా!
Publish Date:Apr 7, 2026
Advertisement
ప్రజాస్వామ్య పండుగగా అభివర్ణించే ఎన్నికలు.. సరిహద్దు ప్రజల పాలిట మాత్రం పరీక్షా సమయాలుగా మారుతున్నాయి. అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల మధ్య భౌగోళిక రేఖ కేవలం పరిపాలన పరమైన విభజన మాత్రమే. కానీ, అక్కడి ప్రజల బంధాలు, వ్యాపారాలు, అవసరాలు పెనవేసుకుపోయి ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల నగారా మోగడంతో, ఈ అనుబంధాల మధ్య ఎన్నికల నియమావళి ఒక అదృశ్య గోడలా నిలుస్తోంది. నిత్యం రాకపోకలు సాగించే సామాన్యుడు అడుగడుగునా నిఘా నీడలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల ప్రజలకు తమిళనాడుతో విడదీయలేని సంబంధం ఉంది. ఉదయం లేచింది మొదలు పాలు, కూరగాయల వ్యాపారం నుంచి షాపింగ్ వరకు అంతా తమిళనాడు పట్టణాలతోనే ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ నిరంతర తనిఖీలు సామాన్యుడిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పోలీసులు, ఎన్నికల అధికారులు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక, పత్రాలు చూపలేక సామాన్యులు గంటల తరబడి చెక్‌పోస్టుల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళనాడులోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. బట్టలు కొనాలన్నా, బంగారం చేయించాలన్నా ఈ ప్రాంత వాసులకు కాంచీపురం, చెన్నై, వెల్లూరు మొదటి ప్రాధాన్యత. అయితే, రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదనే నిబంధన ఇప్పుడు శాపంగా మారింది. తమ కష్టార్జితాన్ని, పొలం అమ్మిన డబ్బునో లేక అప్పు తెచ్చిన మొత్తాన్నో తీసుకెళ్తుంటే.. సరైన ఆధారాలు లేవనే నెపంతో అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలా సుమారు రూ. 2.34 కోట్లకు పైగా నగదు పట్టుబడటం అంటే, అందులో అధిక భాగం సామాన్యుల అవసరాల కోసం తీసుకెళ్తున్నదేనని స్థానికులు వాపోతున్నారు. సీజ్ చేసిన నగదును తిరిగి పొందాలంటే కోర్టుల చుట్టూ, ట్రెజరీల చుట్టూ తిరగడం మధ్యతరగతి వర్గాలకు తలకు మించిన భారంగా మారింది. ఒక రాష్ట్రంలో రేషన్ కార్డు ఉండి, మరో రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న వారు సరిహద్దుల్లో వేల సంఖ్యలో ఉన్నారు. వీరిని ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను అరికట్టాలనే లక్ష్యంతో అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫలితంగా.. నిత్య అవసరాలైన పెట్రోల్, డీజిల్, చివరికి అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్సులలో వెళ్లే వారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఇది మానవీయ కోణంలో చూస్తే బాధితులకు ఒకింత అసౌకర్యంగా మారుతోంది. ఎన్నికల పారదర్శకత కోసం నిబంధనలు ఖచ్చితంగా ఉండాల్సిందే. మద్యం, ఉచితాల పంపిణీని అరికట్టడం హర్షణీయమే. కానీ, ఆ క్రమంలో అమాయకులు బలికాకూడదని మేధావులు సూచిస్తున్నారు. అధికారులు మానవత్వంతో వృద్ధులు, మహిళలు, రోగుల పట్ల కొంత సానుకూల ధోరణి ప్రదర్శించాలంటున్నారు. ప్రజలకు అనవసరమైన చిక్కులు రాకుండా బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఐడీ కార్డులు, వ్యాపార బిల్లులను వెంట ఉంచుకోవాలని కూడా సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు డిజిటల్ పేమెంట్లను ఆశ్రయించడం ఉత్తమమంటున్నారు. మొత్తానికి, ప్రజాస్వామ్య పండుగలో ఓటు వేయడానికి సిద్ధమవుతున్న సామాన్యుడు.. ఈ ఆంక్షల చట్రంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాడు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ సరి‘హద్దు’ కష్టాలు తప్పేలా లేవు. అధికార యంత్రాంగం నిఘాను కొనసాగిస్తూనే, సామాన్యుడి ప్రాథమిక అవసరాలకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
సరిహద్దు ప్రాంతాల్లో వ్యాపారాలు అధికంగా నగదు లావాదేవీల మీదనే ఆధారపడి ఉంటాయి. గొర్రెల వ్యాపారులు, కూరగాయల రైతులు, చిన్న తరహా కాంట్రాక్టర్లు బ్యాంకింగ్ కంటే నగదు రూపంలోనే చెల్లింపులు జరుపుతుంటారు. ఇప్పుడు అధికారులు బ్యాంక్ లావాదేవీలపై, ఏటీఎంల వద్ద కూడా నిఘా ఉంచడంతో వ్యాపార రంగం కుదేలవుతోంది. షాపింగ్ మాల్స్ వెలవెలబోతున్నాయి. ఎప్పుడు ఎవరిని పట్టుకుంటారో, ఏ వస్తువును సీజ్ చేస్తారో తెలియని అయోమయ స్థితిలో ప్రజలు షాపింగ్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
http://www.teluguone.com/news/content/election-heat-at-the-borders-36-216849.html





