గురి తప్పని గుంటూరు బుల్లెట్ ముఖేష్!
Publish Date:Apr 8, 2026
Advertisement
భారత షూటింగ్ రంగంలోకి గుంటూరు బుల్లెట్ దూసుకు వచ్చింది. ఔను తెలుగుతేజం.. గుంటూరు జిల్లాకు చెందిన నేలవల్లి ముఖేష్ తన అద్భుత షూటింగ్ ప్రతిభతో అంతర్జాతీయంగా పతకాల వేట సాగిస్తున్నాడు. షూటింగ్ ఖరీదైన క్రీడ.. ఒక మధ్యతరగతి యువకుడు ఆ రంగంలో అడుగుపెట్టడమే గొప్ప అనుకుంటే.. అక్కడితో ఆగకుండా భారత కీర్తి పతాకను ప్రపంచ దేశాలలో రెపరెపలాడిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించి దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు. షూటింగ్ లో ముఖేష్ ఆసక్తి చిన్నతనం నుంచే ప్రస్ఫుటమైంది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే ఒక సమ్మర్ క్యాంప్ లో షూటింగ్ లో కోచింగ్ తీసుకున్నాడు. గుంటూరులోని ఇండియన్ షూటింగ్ అకాడమీలో కోచ్ సుబ్రమణ్యం వద్ద ముకేశ్ ను షూటింగ్ లో ఓనమాలు నేర్పారు. ఆయన శిష్యరికంలో రాటు దేలిన ముఖేష్ పిస్టల్ షూటింగ్ విభాగంలో విభాగంలో తనదైన శైలిని అలవర్చుకున్నారు. 2017లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సీనియర్ షూటర్లకు గట్టి పోటీనిచ్చి విజేతగా నిలవడంతో ముఖేష్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అదే ఏడాది జాతీయ స్థాయిలోనూ కాంస్యం సాధించిన ముఖేష్ కు ఇక ఆ తరువాత వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్థానికంగా సరైన వసతులు లేనప్పటికీ తనషూటింగ్ ప్రతిభకు మెరుగులు దిద్దుకున్న ముఖేష్.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి షూటింగ్ రేంజ్‌లో కఠిన శిక్షణ తీసుకున్నాడు. దీంతొ 2024 పెరూలోని లిమాలో జరిగిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో పాతిక మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణపతకం సాధించి సంచలనం సృష్టించాడు. ఇదే టోర్నీలో ముఖేష్ మరో రెండు కాంస్య పతకాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అక్కడ నుంచి మొదలైన ముఖేష్ పతకాల వేట.. ఢిల్లీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో స్వర్ణ, రజత పతకాలను గెలుచుకోవడం, ఆ తరువాత జర్మనీ వేదికగా జరిగిన పోటీల్లోనూ కాంస్యం దక్కించునే వరకూ వెళ్లింది. ఆలా దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తిరుగులేని షూటర్ గా ముఖేష్ ఎదుగుతున్నారు. ప్రస్తతం జూనియర్ విభాగంలో అగ్రశ్రేణి షూటర్‌గా రాణిస్తున్న ముకేశ్.. ముందుముందు సీనియర్ కేటగిరీలోనూ ఇదే జోరును కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఒలింపిక్ పతకం అందుకోవడమే తన లక్ష్యం, ధ్యేయం ఆశయం అని చెబుతున్నాడు. ఆత్మవిశ్వాసానికి ఆరడుగుల చిరునామాగా నిలుస్తున్న ముఖేష్ తన ఆశయం సాధిస్తాడని ఆశిద్దాం.
http://www.teluguone.com/news/content/-unerring-guntur-bullet-mukhesh-36-216905.html





