సీఎస్కే వరుస వైఫల్యాలు.. అశ్విన్ ఏ మంటున్నాడంటే?
Publish Date:Apr 7, 2026
Advertisement
టీమ్ ఇండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ఉరుములేని పిడుగులా ఐపీఎల్ కు తన రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. గత ఏడాది అనూహ్యంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన అశ్విన్.. తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను తొలిసారిగా బహిర్గతం చేశారు. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములతో సతమతమవుతున్న తరుణంలో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత సీజన్ తన కెరీర్‌లోనే అత్యంత నిరాశాజనకమైన సమయమన్న అశ్విన్ ఫిట్‌నెస్ పరంగా తాను ఆడే స్థితిలో ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోయాననీ, అందుకే తప్పుకున్నానీ చెప్పాడు. ఐపీఎల్ 2025లో జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నఅశ్విన్.. కేవలం వ్యక్తిగత కారణాలతోనే కాకుండా జట్టు ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని తాను తప్పుకోవాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నానన్నాడు. ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌కు తన వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఆ నిర్ణయం తీసుకు న్నానన్నాడు. తాను జట్టులో ఉంటే రిటెన్షన్ విషయంలో మేనేజ్‌మెంట్ సందిగ్ధంలో పడుతుందని, అదే తాను తప్పుకుంటే సుమారు రూ. 10 కోట్ల భారీ మొత్తాన్ని ఫ్రాంచైజీ ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని అశ్విన్ చెప్పాడు. తాను తప్పుకోవడం వల్ల జట్టుకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని తాను భావించానన్నాడు. ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలుకావడంపై స్పందించిన అశ్విన్.. జట్టులోని యువ ఆటగాళ్లను వినియోగించుకుంటున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు వారి సహజ సిద్ధమైన ప్రతిభకు తగ్గట్టుగా బాధ్యతలు అప్పగించాలన్నాడు. జెమీ ఓవర్టన్ వంటి బౌలర్లకు అలవాటు లేని యార్కర్లు వేయమని ఒత్తిడి చేయడం ఉపయోగం సంగతి అటుంచి ప్రత్యర్థికి అప్పనంగా పరుగులు ఇచ్చే పరిస్థితి ఎదురౌతుందని అభిప్రాయపడ్డాడు యువ ఆటగాళ్లకు సరైన శిక్షణ, ప్రాక్టీస్ వాతావరణం కల్పించకుండా కేవలం ఫలితాలను ఆశించడం వల్ల ప్రయోజనం ఉండదని అశ్విన్ కుండబద్దలు కొట్టేశాడు. అశ్విన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎస్కే అభిమానులైతే.. అశ్విన్ మాటలు నూటికి నూరుపాళ్లూ వాస్తవమంటున్నారు. ఇప్పటికైనా సీఎస్కే టీమ్ మేనేజ్ మెంట్ తన వ్యూహాలకు పదును పెట్టి జట్టును విజయాల బాట పట్టించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/csks-consecutive-failures-in-ipl2026-36-216838.html





