చిన్న విషయాలకు కూడా కోపం వస్తోందా? ఇలా చేస్తే కోపాన్ని జయించవచ్చు..!
Publish Date:Nov 3, 2026
Advertisement
మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి , అనేక రకాల చిన్న చిన్న కారణాల వల్ల చాలా మంది క్షణాల వ్యవధిలోనే తీవ్రమైన కోపం తెచ్చుకుంటూ ఉంటారు. కొందరికైతే చిన్న చిన్న విషయాలు కూడా విపరీతమైన అసహనాన్ని, కోపాన్ని తెప్పిస్తుంటాయి. ఇలా తరచూ కోపపడటం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడమే కాకుండా, శారీరక ఆరోగ్యం కూడా తీవ్రంగా క్షీణిస్తుంది. రక్తపోటు పెరగడం, గుండె జబ్బులు రావడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, కొంచెం శ్రద్ధ, సరైన మానసిక వ్యాయామాలతో కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. కోపాన్ని జయించి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
లోతుగా శ్వాస తీసుకోవడం..
కోపం తీవ్రంగా వచ్చిన సమయంలో దాన్ని నియంత్రించుకోవడానికి చాలా ప్రభావవంతమైన మార్గం దీర్ఘ శ్వాస తీసుకోవడం. కోపం తారస్థాయికి చేరినప్పుడు ఊపిరి వేగం పెరుగుతుంది. ఆ సమయంలో కొద్దిసేపు కళ్ళు మూసుకుని గాలిని గట్టిగా లోతుగా లోపలికి పీల్చుకుని, మెల్లగా వదలాలి. ఇలా కొన్నిసార్లు చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సాధారణ స్థితికి వస్తుంది, మనసు కుదుటపడుతుంది. ఆలోచించే శక్తి మెరుగుపడుతుంది.
ప్రదేశం నుండి పక్కకు వెళ్లడం..
మనం ఉన్న ప్రదేశం లేదా పరిస్థితిని కొద్దిసేపు మార్చడం ద్వారా కూడా కోపాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. చిన్న విషయానికే కోపం వచ్చినప్పుడు ఆ క్షణంలో అక్కడ నుంచి పక్కకు వెళ్లడం మంచిది. కొద్దిసేపు నడవడానికి వెళ్లడం లేదా మనసుకు నచ్చిన ప్రశాంతమైన సంగీతం వినడం చేయాలి. వాతావరణం మారినప్పుడు మెదడులోని ఉద్రిక్తత తగ్గి, ఆలోచనల తీరు మారుతుంది.
మౌనం..
కోపం వచ్చిన సమయంలో మాట్లాడే మాటలు చాలాసార్లు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే కోపం ముంచుకొస్తున్నప్పుడు మౌనంగా ఉండటం చాలా మంచిది. మాట్లాడటానికి ముందు పది వరకు నెంబర్స్ ను మనసులో లెక్కపెట్టుకోవాలి. ఈ చిన్న సమయంలో మన ఆలోచనలు అదుపులోకి వస్తాయి. అనర్థాలు జరగకుండా ఆపవచ్చు.
వ్యాయామం..
శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మిగిలిపోయిన ఉద్రిక్తత, ఒత్తిడి తగ్గిపోతాయి. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవి మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచడానికి, ఎమోషన్స్ ను నియంత్రించుకోడానికి ఎంతగానో సహాయపడతాయి.
జీవితంలో చిన్న చిన్న విషయాలకు కోపపడటం వల్ల మన సంతోషాన్ని మనమే దూరం చేసుకున్నట్టవుతుంది. కోపం అనేది మనల్ని మనం శిక్షించుకోవడంతో సమానం. కాబట్టి ప్రతి విషయాన్ని పాజిటివ్ దృక్పథంతో చూడటం నేర్చుకోవాలి. చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకోకుండా, ఓర్పుతో ఆలోచించడం అలవాటు చేసుకుంటే కోపాన్ని సులభంగా జయించవచ్చు. ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/do-you-get-angry-over-small-things-35-236195.html




