తెలుగునాడుగా ఏపీ.. పేరుమార్పుపై మళ్లీ మొదలైన చర్చ!
Publish Date:Mar 2, 2026
Advertisement
కేంద్ర క్యాబినెట్ ఎప్పుడైతే కేరళ పేరుని.. కేరళంగా మార్చేందుకు ఆమోదం తెలిపిందో.. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్రాల పేర్ల మార్పుపై చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు అంశంపైనా చర్చ జరుగుతోంది. ప్రసిద్ధ ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ పేరుని.. తెలుగునాడుగా మార్చాలనే ప్రస్తావన తేవడంతో.. ఈ చర్చ సాంస్కృతికంగానూ, రాజకీయంగానూ సెగ పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మార్చాలనే ప్రతిపాదన.. 3వ ప్రపంచ తెలుగు మహాసభ నుంచి వచ్చింది. తమిళం మాట్లాడే రాష్ట్రాన్ని తమిళనాడుగా ఏర్పాటు చేశారు కాబట్టి.. తెలుగు మాట్లాడేవారి రాష్ట్రమైన ఏపీని కూడా తెలుగునాడుగా మార్చాలంటున్నారు. అయితే.. రాష్ట్రం పేరు మార్పు అనేది.. కేవలం అక్షరాల మార్పు కాదు. ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అంశం. అందువల్లే.. తెలుగు భాష పేరు మన రాష్ట్రం పేరులోనూ ఉండాలనే చర్చ మొదలైంది. ఎందుకంటే.. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసింది తెలుగువారే. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా.. 1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాయ్. అప్పుడే.. కొందరు మేధావులు తెలుగునాడు పేరుని సూచించినా, ఆనాడు ఆంధ్ర అనే పదానికే మొగ్గు చూపారు. 1969లో మద్రాసు రాష్ట్రం తమిళనాడుగా మారింది. ఇటీవలే.. ఒరిస్సా ఒడిశాగా, పాండిచ్చేరి పుదుచ్చేరిగా మారాయి. ఇప్పుడు కేరళని.. కేరళంగా మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ క్రమంలో.. తెలుగు అస్థిత్వం కోసం ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలన్న వాదన తెరమీదకొచ్చింది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలన్న గరికపాటి నరసింహారావు వాదనపైనే.. ఇప్పడు ఏపీలో డిబేట్ నడుస్తోంది. ఏపీని తెలుగునాడుగా మార్చాలనీ.. ఇందుకోసం అప్పట్లో ఎన్టీఆర్ ఎంతో ప్రయత్నించారని చెప్పారు గరికపాటి. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు పదం కాదని, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదనం లేదని అన్నారాయన. రాష్ట్రం పేరు విషయంలో.. కేరళ వాళ్లకున్న పట్టుదల మనకు లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్య చర్చకు దారి తీసింది. అయితే.. గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుకాదని ఎలా అంటారు, రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనే పదం ఉందన్నారాయన. గరికపాటి వ్యాఖ్యలపై ఎవరి వాదన, వివరణ ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్చాలనే డిమాండ్ సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది. కేరళ పేరుని కేరళంగా మార్చిన తర్వాత.. సోషల్ మీడియాలో ఏపీ ప్రజల నుంచి ఇలాంటి వాదన మొదలైంది. వాస్తవానికి.. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా.. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. అయితే.. ఆంధ్ర అనే పదం ఒక జాతిని, కోస్తాంధ్ర లాంటి నిర్దిష్ట ప్రాంతాన్ని సూచిస్తుందనే భావన చాలా కాలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనే పేరులో.. భాష కంటే ప్రాంతం ఎక్కువగా ధ్వనిస్తుంది. తమిళనాడులో భాష ఉన్నట్లుగా.. మన దగ్గర భాషా గుర్తింపు పేరులో లేదనేదే అసలైన వాదన. అందువల్ల.. తెలుగునాడు అనే ప్రతిపాదనపై ఇప్పుడు డిస్కషన్ మొదలైంది. అది కేవలం ఓ ప్రాంతానికో, కులానికో సంబంధించింది కాదు. పూర్తిగా.. భాషకు, అస్థిత్వానికి సంబంధించింది. తెలుగు అనేది అందరిదీ. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలను కలిపి ఉంచే ఏకైక సూత్రం తెలుగు భాష. అందువల్ల.. ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మారిస్తే.. సమైక్య భావన వస్తుందనే చర్చ జరుగుతోంది. పొరుగు రాష్ట్రం మద్రాస్ స్టేట్ నుంచి తమిళనాడుగా మారినప్పుడు లేని అభ్యంతరం.. ఆంధ్రప్రదేశ్ తెలుగునాడుగా మారితే ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సాంస్కృతిక మూలాలపరంగా చూస్తే.. ప్రాచీన సాహిత్యంలో.. తెలుగు పదానికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కువ. ఆంధ్ర అనేది సంస్కృత పదం. తెలుగు అనేది అచ్చమైన దేశీ పదం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు.. తనని తాను తెలుగువాడని చెప్పుకునేందుకు గర్వపడతాడు. ఆంధ్రుడు అనే పదం కంటే.. తెలుగువాడు అన్నది.. ఎక్కువ కలుపుగోలుతనంతో ఉంటుంది. పైగా.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషకు గుర్తింపు ఉంది. రాష్ట్రం పేరులో ఆ భాషా ముద్ర ఉండటం వల్ల.. ఆంధ్రులకు ప్రత్యేక అస్థిత్వం వస్తుంది. కేరళ తన మూలాలను వెతుక్కుంటూ.. కేరళంగా పేరు మార్చుకున్నప్పుడు, తెలుగు వారు కూడా తమ అస్థిత్వం కోసం తెలుగునాడు అని పిలుచుకోవడంలో ఏమాత్రం తప్పులేదనేది భాషా ప్రేమికుల వాదన. అయితే.. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, రాజధాని సమస్యల నేపథ్యంలో.. ఈ వాదనకు, ఈ డిమాండ్ కుఇది సరైన సమయమా? కాదా? అనేది కూడా చర్చకు వస్తోంది. అయినా.. పేరులో ఏముంది? అనే వాళ్లున్నా.. ఆ పేరులోనే మా ఆత్మగౌరవం ఉందని చెప్పే సంస్కృతి తెలుగు ప్రజలది. ఏపీ పేరు మార్పుపై.. గరికపాటి నరసింహారావు తెచ్చిన ప్రస్తావన.. కేవలం చర్చగా మిగిలిపోతుందా? లేక భవిష్యత్తులో ఉద్యమంగా మారుతుందా? అన్న డిబేట్ కూడా మొదలైంది.
http://www.teluguone.com/news/content/debate-on-name-change-of-ap-state-36-214897.html





