భారత్‌పై పెట్రో ధరల పంజా
Publish Date:Mar 2, 2026
Advertisement
పశ్చిమాసియాలో యుద్ద వాతావరణం తీవ్రరూపం దాల్చిన ప్రభావంతో చమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో ఇప్పటికే ధరలు 10 శాతం మేర పెరిగాయి. సోమవారం (మార్చి 2) మార్కెట్లు ప్రారంభమైన సమయంలో ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో బ్రెంట్ క్రూడ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఒక బ్యారెల్‌కు 10 శాతం పెరిగి 81.87 డాలర్ల గరిష్ఠానికి చేరింది. ఫ్యూచర్స్‌లో బ్రెంట్ క్రూడ్ 13 శాతం పెరిగి 82.37 డాలర్లకు పెరిగింది. 2025 జనవరి తర్వాత ఇదే అత్యధిక స్థాయి. ఆదివారం (మార్చి 1) కూడా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ భారీగా క్షిపణులు ప్రయోగించింది. గల్ఫ్ తీరంలో మూడు చమురు ట్యాంకర్లను దెబ్బతీశామని ఇరాన్ అధికారులు వెల్లడించారు. దీంతో చమురు రవాణా నిలిచిపోతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒమన్-ఇరాన్ మధ్య ఇరుకుగా ఉండే సముద్ర మార్గమే హర్ముజ్ జల సంధి. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు ఈ మార్గంలోనే ప్రపంచం వినియోగిస్తోన్న చమురులో 20 శాతం దిగుమతి అవుతోంది. ప్రపంచ దేశాలు వినియోగించే ఎల్‌ఎన్‌జీలోనూ 20 శాతం ఇక్కడినుంచే సరఫరా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. భౌగోళిక, రాజకీయ ఒడుదొడుకులు ఎదురైనప్పుడు భారత ఇంధన అవసరాలను తీర్చడానికి దేశంలోని వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు 74 రోజుల పాటు సరిపోతాయని గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దిప్‌సింగ్ పురి వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అతిపెద్ద చమురు కొనుగోలుదారుల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. రోజుకు 5.5 మిలియన్ల బ్యారెళ్ల మేర వినియోగిస్తోంది. అందులో 1.5 నుంచి 2 మిలియన్ల మేర ఈ జలసంధి నుంచే సరఫరా అవుతోంది. ఇప్పటికే రష్యా చమురు కొనుగోలు తగ్గించడంతో ఇప్పుడు పశ్చిమాసియా ప్రత్యామ్నాయంగా మారింది. బ్రెంట్ క్రూడ్ ధర ఒక డాలర్ పెరిగినా.. ఒక ఏడాదికి ప్రభుత్వం రూ.13వేల కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది 160 బిలియన్ డాలర్ల మేర చమురును భారత్ దిగుమతి చేసుకుంది
http://www.teluguone.com/news/content/war-effect-on-crude-oil-prices-36-214895.html





