వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దపడ్డారుట!

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేసిన దీక్ష విషయంలో అనుకొన్నది ఒకటయితే జరిగింది మరొకటి. ప్రత్యేక హోదా అంశంపై నిరాహార దీక్ష చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బుక్ చేసేయాలనుకొంటే చివరికి తనే అడ్డంగా బుక్ అయిపోయారు. ప్రభుత్వం పోలీసులను పంపి దీక్ష భగ్నం చేయకపోయుంటే జగన్ పరిస్థితి ఏమిటి? అప్పుడు వైకాపా నేతలు ఏమి చేసేవారు? అని ఆలోచిస్తే బహుశః వారే జగన్ చేత దీక్షని విరమింపజేసి ఉండేవారని చాలామంది భావించారు. కానీ ఏడవరోజు తెల్లవారుజామున ప్రభుత్వం పోలీసులను పంపి జగన్ దీక్షను భగ్నం చేయకపోయుంటే చివరి అస్త్రంగా వైకాపా ఎమ్మెల్యేలు అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని అనుకొన్నారుట. కానీ ఆ సంగతి ముందే పసిగట్టిన ప్రభుత్వం పోలీసులను పంపించి వైకాపా నేతలు కోరుకొన్నట్లే జగన్ దీక్ష భగ్నం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారుట.

 

ఒకవేళ ప్రభుత్వం పోలీసులను పంపకుండా ఆలశ్యం చేసి ఉంటే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉండేవారనుకొంటే, జగన్ దీక్ష వలన చివరికి వైకాపాయే నష్టపోయేదని అర్ధం అవుతోంది. అప్పుడు కూడా వారిలో కొందరు రాజీనామాలు చేయడానికి నిరాకరించినా లేదా ఇతర పార్టీలలోకి జంప్ అయిపోయినా అది ఇంకా అప్రదిష్ట అవుతుంది. కానీ జగన్ అదృష్టం కొద్దీ ప్రభుత్వం సకాలంలో పోలీసులను పంపించి ఆయన ప్రాణాలని, ఆయన పార్టీని కూడా కాపాడిందనుకోక తప్పదు. చంద్రబాబు నాయుడుని ఇరుకునపెట్టి ఆనందిద్దామనుకొంటే, చివరికి ప్రాణాలు రక్షించుకొనేందుకు తన ఎమ్మెల్యేలనే బలిచేసుకొనే పరిస్థితి ఏర్పడటం విచిత్రమే. ఏది ఏమయినప్పటికీ జగన్ మళ్ళీ ఎప్పుడయినా నిరవదిక నిరాహార దీక్ష చేయలనుకొంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకొనేలా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన రాజకీయ అనుభవం ముందు జగన్ ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రయోజనం ఉండదని మరొకమారు నిరూపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu