బీజేపీకి ఏ గన్నులు అచ్చిరావట్లేదు!
posted on Oct 15, 2015 12:10PM
.jpg)
బీజేపీకి ఏ గన్ను అచ్చిరానట్లుంది. గన్ అంటే ఆ గన్ను కాదు..బాలీవుడ్ నటులు శత్రు’గన్’ సిన్హా, అజయ్ దేవగన్. ఇంతకు ముందు శత్రు‘గన్’ సిన్హాని నమ్ముకొంటే ఆయన వెళ్లి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి బాకా ఊదడం మొదలుపెట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానంగా నితీష్ కుమార్, నరేంద్ర మోడిల మధ్యనే యుద్ధం జరుగుతోంది. మోడీ నితీష్ కుమార్ ని విమర్శిస్తుంటే, శత్రుగన్ సిన్హా “నితీష్ కుమార్ అంత మంచివాడు, సమర్దుడయిన ముఖ్యమంత్రి లేడని” పొగుడుతున్నారు. అప్పుడు బీజేపీకి ఎలాగుటుందో తేలికగానే ఊహించవచ్చును.
తనకే శత్రువుగా మారి బ్యాక్ ఫైర్ అవుతున్న ఆ శత్రు ‘గన్’ న్ని బీజేపీ పక్కనబెట్టి బీహార్ ఎన్నికల కోసమే బాలీవుడ్ నుంచే మరో కొత్త ‘గన్’ తెచ్చుకొంది. అదే అజయ్ దేవ్ ‘గన్.’ కానీ ఈ కొత్త గన్ కూడా బ్యాక్ ఫైర్ అవుతుండటంతో బీజేపీ అభ్యర్ధులు చాలా కంగారుపడుతున్నారు.
నలందా జిల్లాలోని బీహారి షరీఫ్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఆయన తరపున ఎన్నికల ప్రచారం చేయడం కోసం అజయ్ దేవగన్ బయలుదేరారు. కానీ ఆయన ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటు అన్నట్లుగా ఆయన దిగవలసిన సభకి ఐదారు గంటలు లేటుగా చేరుకొంటున్నారు. దానితో సహనం కోల్పోయిన జనాలు కుర్చీలు విసిరి కొడుతుంటే, వారిని అదుపు చేయడానికి పోలీసులు కర్రలు తీయవలసి వస్తోంది. ఎన్నికల ప్రచారసభ కాస్త రణరంగంగా మారిపోయింది. క్రింద జరుగుతున్న ఆ హడావుడి చూసి అజయ్ దేవగన్ హెలికాఫ్టర్ లో నుండే ప్రజలకు టాటా బైబై చెప్పేసి వెళ్లిపోయారు.
అజయ్ దేవగన్ వస్తున్నాడని ఆయనని చూసేందుకు జనాలు వస్తే పోలీసుల చేత లాఠీ దెబ్బలు తినవలసి వచ్చింది. అయినా ఓపికగా ఆకాశం నుండి ఊడిపడే ఆ బాలివుడ్ గన్ కోసం అన్ని గంటలపాటు మండుటెండలో ఎదురుచూస్తే చివరికి ఆయన ఆకాశంలోనుంచే టాటా బై బై చెప్పేసి ఎగిరిపోతే అప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తుప్పు పట్టిన పాత గన్ న్ని పక్కనపెట్టి ఈ కొత్త గన్ న్ని తెచ్చుకొంటే అది కూడా ఇలా బ్యాక్ ఫైర్ అవుతుండటంతో ఆ గన్ పేరు చెపితే చాలు బీజేపీ అభ్యర్ధులు భయపడిపోతున్నారు. మా తిప్పలేవో మేమే పడతాము మాకు ఏ గన్నూ వద్దని అంటున్నారుట.