అమరావతి కంటే జగన్ పోరాటాలే ముఖ్యమా?
posted on Oct 14, 2015 3:43PM
(1).jpg)
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోరుతూ నిరాహార దీక్ష చేసారు. ఆరు రోజులకే అది ముగిసిపోయింది. ఆయన ప్రత్యేక హోదా కోసమే దీక్ష చేసినప్పటికీ, ప్రత్యేక హోదా గురించి కంటే ఆయన నిరాహార దీక్ష గురించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి, రాష్ట్రం కోసం ఆయన ఏవిధంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన దాని గురించే సాక్షి మీడియా హైలైట్ చేసి చెప్పుకొంటోంది. చివరికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి ముఖ్యమయిన రాజధాని శంఖుస్థాపన కార్యక్రమం గురించి ఎక్కడా పొరపాటున కూడా ఒక్క ముక్క పలకకుండా జాగ్రత్తపడుతూ జగన్ దీక్ష, జగన్ ఆరోగ్యం, తెలంగాణాలో బతుకమ్మ పండుగ సంబరాల గురించి మంచి కవరేజ్ ఇస్తోంది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని పదేపదే చెప్పుకొంటున్న జగన్మోహన్ రెడ్డి మరి అమరావతి శంఖుస్థాపన గురించి ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడటం లేదు? కనీసం ఆయన సాక్షి మీడియా కూడా దానికి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు? జగన్ దీక్షకి ఉన్నంత ప్రాధాన్యత దానికి లేదా? లేక చంద్రబాబు నాయుడు చేపట్టే ఏ కార్యక్రమాన్నయినా వ్యతిరేకించడమే తన పార్టీ సిద్దాంతంగా మార్చుకొన్న జగన్ అమరావతి శంఖుస్థాపనని కూడా వ్యతిరేకిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మహాకవి శ్రీశ్రీ లోకం యొక్క బాధను తన బాధగా భావిస్తూ కవితలు వ్రాసేవారు. కానీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తన బాధనే లోకం యొక్క బాధగా అభివర్ణిస్తూ కవితలు వ్రాసేవారు. జగన్మోహన్ రెడ్డి కూడా కృష్ణశాస్త్రి గారి పద్ధతిలోనే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ కి ఎంతసేపు తన పార్టీ, తన పోరాటాలు, తన దీక్ష, తన ఆరోగ్యం, తన పదవి లాలస, అన్నీ తనవే...కానీ వాటినే ప్రజల కోసం చేస్తున్న పోరాటాలుగా చెప్పుకొంటూ అందుకు ప్రజల మద్దతు ఆశిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సమస్యలన్నిటికీ ఆయన చెపుతున్న ఏకైక పరిష్కారం ఒక్కటే...తను తక్షణమే ముఖ్యమంత్రి అయిపోవడం. అందుకోసమే ఈ పోరాటాలు ఆరాటాలు అని నేరుగా చెప్పకుండా రాష్ట్రం కోసం తానొక్కడే పోరాడుతుంటే ప్రభుత్వం దానికి అడ్డు పడుతోందని వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తను రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని విమర్శిస్తుంటారు. వారిద్దరిలో రాష్ట్రానికి ఎవరివల్ల మేలు కలుగుతోంది...ఎవరి వల్ల హాని కలుగుతోంది? అని ప్రజలే ఆలోచించుకోవాలి.