డిసెంబరు 21.. బాలయ్యకు వెరీ వెరీ స్పెషల్!
on Dec 21, 2025

కొందరు సినీ స్టార్స్ కి కొన్ని తేదీలతో అనుబంధం ఉంటుంది. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు కూడా డిసెంబర్ 21తో ఎంతో అనుబంధం ఉంది. ఆ తేదీన రిలీజైన బాలయ్య చిత్రాలు రెండు.. ఈ యేడాదితో ఒకటి 40 ఏళ్ళు, మరోటి 35 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాయి. అలాగే, బాలయ్య జీవితంలో ఆ తేదికి మరో ప్రత్యేకత కూడా ఉంది.
ప్రస్తుతం 'అఖండ-2'తో జనాన్ని అలరిస్తున్న బాలకృష్ణ జీవితంలో డిసెంబర్ 21కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ తేదీన బాలయ్య హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'పట్టాభిషేకం' విడుదలయింది. 1985 డిసెంబర్ 21న విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం అప్పట్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఆ యేడాది అంతటి వసూళ్ళు సాధించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన విజయశాంతి నాయికగా నటించారు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం ఓ ఎస్సెట్ కాగా, ఇందులో శ్రీకృష్ణుని గెటప్ లో బాలయ్య ఓ పాటలో కనిపించి అభిమానులకు ఆనందం పంచారు. అలా నలభై ఏళ్ళ క్రితం 'పట్టాభిషేకం' బాలయ్య ఫ్యాన్స్ ను మురిపించింది.
'పట్టాభిషేకం' విడుదలయిన ఐదు సంవత్సరాలకు అంటే 1990 డిసెంబర్ 21వ తేదీన బాలకృష్ణ హీరోగా రూపొందిన లారీ డ్రైవర్ విడుదలై విజయఢంకా మోగించింది. ఇందులోనూ విజయశాంతి నాయికగా నటించడం విశేషం. 'లారీడ్రైవర్'తోనే బాలయ్య-బి.గోపాల్ బ్లాక్ బస్టర్ కాంబోకి బీజం పడింది.
Also Read: షాకింగ్.. రాజమౌళి లాస్ట్ మూవీ వారణాసి..!
డిసెంబర్ 21న రిలీజైన బాలయ్య తొలి చిత్రం 'పట్టాభిషేకం'కు కె.రాఘవేంద్రరావు దర్శకుడు కాగా, అదే తేదీన ఐదేళ్ళకు వచ్చిన 'లారీ డ్రైవర్'కు ఆయన శిష్యుడు బి.గోపాల్ డైరెక్టర్ కావడం విశేషం. ఈ రెండు చిత్రాల్లోనూ విజయశాంతి నాయికగా నటించి మురిపించగా, రెండు సినిమాలూ చక్రవర్తి స్వరకల్పనలోనే రూపొందాయి. ఈ రెండు సినిమాలకు పరుచూరి బ్రదర్స్ రచయితలు కావడం గమనార్హం.
'పట్టాభిషేకం' చిత్రానికి బాలయ్య అన్న నందమూరి హరికృష్ణ నిర్మాత కాగా, 'లారీ డ్రైవర్' సినిమాకు రావు గోపాలరావు సమర్పకుడు. ఈ రెండు చిత్రాల విజయానికి మధ్యలో బాలయ్యకు ఓ మరపురాని అనుభూతిని మిగిల్చింది డిసెంబర్ 21వ తేదీ. 'పట్టాభిషేకం' రిలీజైన రెండేళ్ళకు డిసెంబర్ 21న బాలయ్యకు తొలి సంతానంగా బ్రహ్మణి జన్మించింది. ఆమెకు మూడేళ్ళు పూర్తయిన రోజున 'లారీ డ్రైవర్' రిలీజయింది.
ఇలా డిసెంబర్ 21తో బాలయ్యకు ఎంతో అనుబంధం ఉంది. అందువల్ల ఆ తేదీని ఆయన ఫ్యాన్స్ సైతం భలేగా గుర్తుంచుకుంటారు. అప్పట్లో అభిమానులు ఓ పండగలా చేసుకొనేవారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



