ప్రపంచ అభివృద్ధి పై వికలాంగుల సంతకాలు!
posted on Dec 3, 2024 9:32AM
“నన్ను నా సామర్ధ్యం నుంచి తెలుసుకో, నా వైకల్యం నుంచి కాదు” - అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
ఈ లోకంలో ప్రతీ తల్లీతండ్రీ తమకి పుట్టే బిడ్డ అందంగా, ఆరోగ్యంగా పుట్టాలనే ఆశపడతారు. అలా ఇవ్వమనే భగవంతుణ్ణి ప్రార్దిస్తారు. కానీ చాలా కారణాల వల్ల కొన్నిసార్లు పిల్లలు రకరకాల వైకల్యాలతో పుడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు చాలామటుకు ఈ లోకంలోకొచ్చిన మొదటి క్షణం నుంచే కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎంతో వివక్షని ఎదుర్కొంటారు. పెద్దయ్యేవరకూ ఇదే వివక్ష కొనసాగిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు కూడా మన సమాజంలో భాగమేనని, వారికీ సామర్ధ్యాలు ఉంటాయని గుర్తించి, వాళ్లపై వివక్ష చూపించకుండా వారి అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం అందరికీ ఉంది.
అందుకే వికలాంగుల హక్కులపై అవగాహన పెంచి, వారి సంక్షేమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా, 1992 నుంచి డిశంబర్3వ తేదీని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా జరపటం మొదలుపెట్టింది. ఈ రోజు, సమాన అవకాశాలు, అందుబాటు, సమగ్రత యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తూ, వికలాంగుల విజయాలు గురించి, సమాజానికి వారు చేసిన సేవలని గురించి ప్రశంసిస్తుంది.
ప్రతి సంవత్సరం డిసెంబరు3న జరుపుకునే వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం ఒకో ఏడాది ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రవేశపెడుతుంది. "వికలాంగుల నాయకత్వాన్ని పెంపొందించి, సమగ్రత, స్థిరమైన భవిష్యత్తుకు దారితీయడం." ఇది ఈ ఏడాది థీమ్. ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల విలువైన పాత్రను, నాయకత్వాన్ని ఇది గుర్తిస్తుంది. అలాగే, వారి జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వారిని చేర్చుకోవడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది.
ఈ రోజు, వికలాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి అవగాహన కలిగించడం, సమాజంలోని అన్ని రంగాల్లో సమానంగా, సంపూర్ణంగా పాల్గొనేలా వారిని కూడా ప్రోత్సహించడం కోసం ఒక వేదికగా పనిచేస్తుంది. వికలాంగుల జీవితాలను మెరుగుపరిచి, వారికి తగిన గౌరవం ఇవ్వటంలో ప్రభుత్వాలు, సంస్థలు, సమాజానికి అవకాశాన్ని అందిస్తుంది. వికలాంగుల హక్కులు, సంక్షేమానికి మద్దతు ఇవ్వడం సాటి మనిషిగా మన బాధ్యత.
వివిధ మార్గాల్లో ప్రతీ ఒక్కరూ ఈ బాధ్యత తీసుకుని వారి అభివృద్ధికి సాయపడవచ్చు. అందులో కొన్ని తెలుసుకుంటే..
అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం:
వికలాంగులకు సంబంధించిన సమస్యలపై చర్చలు, వర్కుషాపులు నిర్వహించటం ద్వారా ప్రజలకి వారి సమస్యలపై అవగాహన తెప్పించవచ్చు. వైకల్యం అనేది కేవలం బయటకి కనిపించేది మాత్రమే కాదు, బయటకి కనిపించని (ఆటిజం, డిస్లెక్సియా, డిస్కాల్కులియా) వైకల్యాలు కూడా ఉంటాయని పాఠశాల స్థాయినుంచే గుర్తించి, అటువంటివారి అభివృద్ధి కోసం మనం అందించగలిగే సహకారం ఏమిటనేది అందరికీ అవగాహన కల్పించాలి.
విజయాలను గుర్తించటం:
పుట్టినప్పటి నుంచో లేక ప్రమాదం వల్లనో వైకల్యం వచ్చినప్పటికీ, కఠిన పరిస్థితులకి తలొగ్గకుండా, ఏ వైకల్యం మమ్మల్ని ఆపలేదని నిరూపిస్తూ, విజయాలు సాధించిన ఎంతో మంది వికలాంగుల విజయాలను గుర్తించి ప్రశంసించాలి. అప్పుడే అలాంటివారిని చూసి మిగిలిన వారికి ప్రేరణ కలుగుతుంది.
జీవిత అనుభవాలు చెప్పించటం:
ఈ వివక్ష చూపించే సమాజంలో తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యలు గురించి , వికలాంగుల అనుభవాలను పంచుకుని అవగాహన పెంచవచ్చు. టెక్నాలజీ, విధానాలలో మార్పులు తీసుకురావటం: వికలాంగులు కూడా మనలాగే రోజువారీ జీవితాన్ని గడపగలగాలంటే, వికలాంగులకి తగిన మౌలిక సదుపాయాలు, రవాణా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రోత్సహించటం ద్వారా వారు కూడా మనలాగే అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. సమాజంలోని వైద్య, విద్య, రవాణా సంస్థల్లోనూ, వారు పని చేసే సంస్థల్లోనూ కొన్ని విధానాల్లో మార్పులు తీసుకురావటం, వారికి ఉపయోగపడే సాంకేతికతని అందుబాటులోకి తీసుకురావటం వంటివి చేయాలి. అప్పుడే ఉద్యోగుల వృత్తిపరమైన అవసరాలు తీరి వారు కూడా సమాజ అభివృద్ధిలో భాగమవుతారు.
వికలాంగుల సంస్థలకు మద్దతు ఇవ్వటం:
వికలాంగుల సంక్షేమానికి పనిచేసే సంస్థలకు స్వచ్ఛందంగా సేవ చేయండి లేదా సహాయం చేయండి. ఈ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, గ్లోబల్ నుండి లోకల్ వరకు అన్నిరంగాల్లో, అన్ని విధాలుగా మనం సులభతరం చేసే మార్గాలు గురించి మాత్రమే కాకుండా, వికలాంగులు కూడా తమ గొంతును వినిపించి, సమాజంలో వారి భాగస్వామ్యాన్ని కూడా గుర్తించడానికి ఒక అవకాశం ఇస్తుంది. వికలాంగుల మేలు కోసం దీర్ఘకాలిక మార్పులను అమలు చేయడం ప్రారంభించి, వారికి ప్రాముఖ్యతని ఇవ్వటం ద్వారా మరింత సమర్థవంతమైన భవిష్యత్తును రూపొందించవచ్చు.
మనలో ఉన్న వైకల్యాన్ని ఒప్పుకొని క్రుంగిపోవటమే అసలు వైకల్యమని, మానసికంగా దృఢంగా నిలబడి, వైకల్యాన్ని కూడా విజయపధం వైపు నడిచే ప్రేరణగా, బలంగా మార్చుకున్న గొప్ప వ్యక్తులు ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అటువంటివారు మిగిలిన అందరికీ ఆదర్శంగా నిలిచి ఈ సమాజంలో వారి పాత్ర కూడా ఉందన్న నిజాన్ని ప్రపంచమంతా అర్ధం చేసుకుని, వారిపై ఎటువంటి వివక్షా లేని సమాజం వైపు అడుగువేయాలని కోరుకుందాం…
*రూపశ్రీ