బిడ్డ కడుపు నింపటానికి ఓ తల్లి చేసిన ప్రయత్నం ... కోటి రూపాయల వ్యాపారానికి దారి తీసింది...!
posted on Dec 3, 2024 9:30AM
హరిత విప్లవం, శ్వేత విప్లవం అని అనేక నూతన విధానాలు వచ్చి, చాలా మంది ఆకలి తీర్చినప్పటికీ, ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే, మనం రోజువారీ తినే తిండి స్వచ్ఛమైనదని చెప్పలేకపోతున్నాము. ఇప్పుడున్న రసాయన వినియోగానికి, కాలుష్యానికి, మన జీవన విధానంలో వచ్చిన మార్పుకి మనం రోజూ ఆహారం తింటున్నామో, మందులు తింటున్నామో తెలియట్లేదు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయో తెలియట్లేదు. ఉత్తరప్రదేశ్, లక్నో నివాసి అయిన ఒక తల్లి, జ్యోతిపద్మ బాధ కూడా ఇలాంటిదే...
ఏ పిల్లలకయినా పాలు ప్రధమ, ప్రధాన ఆహారంగా ఉంటాయి. కానీ తన కూతురు విషయంలో ఆ ఆకలి తీర్చే పాలు తాగటమే శాపంగా మారిందనే విషయం జ్యోతి పద్మ బాధకి కారణమైంది. జ్యోతి పద్మ కూతురుకు పాలు తాగిస్తే జీర్ణించుకునేది కాదు. అయితే తన కూతురుకి ఎందుకు ఇలా జరుగుతుందో, మిగతా పిల్లల్లా ఎందుకు పాలని సహించుకోలేకపోతుందనే విషయం అర్ధం చేసుకోలేక, పాలు తాగితే చాలు మంచం పడుతున్న తన కూతురు పరిస్థితిని చూడలేక ఆ తల్లి తల్లడిల్లిపోయింది. చివరికి డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే, తన కూతురుకి ‘ లాక్టోజ్ ఇన్ టోలరెన్స్’ అనే లోపం ఉందని తెలుసుకుంది. తన కూతురు పాలుగానీ, పాల ఉత్పత్తులు కానీ ఎందుకు జీర్ణించుకోలేకపోతుందన్న నిజం తెలుసుకున్న ఆమె ఆశ్చర్యానికి గురయింది. తన కుటుంబంలో కానీ, తన భర్తవైపు కుటుంబంలో కానీ ఎవరికీ లేని సమస్య తన కుమార్తెకి వచ్చేసరికి ఆమెకి ఏం చేయాలో అర్ధం కాలేదు.
తన కుమార్తెకి వచ్చిన ఈ సమస్యని ఆమె సులువుగా వదల్లేకపోయింది. ఈ సమస్యకి పరిష్కారం కోసం, తన కుమార్తెకి తగిన పోషకాలు అందించాలనే తపనతో ఆమె తన ప్రయత్నాలు చేయటం మొదలు పెట్టింది. ఏ కంపెనీ పాలయినా తన కూతురు జీర్ణించుకోగలుగుతుందేమో అనే ఆశతో మార్కెట్లో దొరికే రకరకాల కంపెనీల ప్యాకేజ్డ్ పాలు ఇచ్చేది. కానీ అవేవీ పడకపోవటంతో, ఈసారి స్థానిక డైరీల నుంచి పాలు తెచ్చి అవి ఇవ్వటం మొదలుపెట్టింది. కానీ ఆ పాల ఉత్పత్తిలో కూడా అపరిశుభ్రత, రసాయన ఆహారాల వినియోగం వంటివి ఉండటంవల్ల వాటిని కూడా ఆమె కుమార్తె శరీరం జీర్ణించుకోలేక తిప్పికొట్టింది. అయితే మన ప్రయత్నం బలంగా ఉంటే భగవంతుడు కూడా సాయం చేస్తాడన్న మాటని నిజం చేస్తూ.. 2018లో, ఆమె సోదరి వాళ్ళ ఇంటి ఆవు నుంచి తీసి, పంపించిన పాలు జ్యోతి పద్మకి పరిష్కారాన్ని చూపించాయి. ఆశ్చర్యకరంగా ఆ పాలను ఆమె కుమార్తె తేలికగా జీర్ణం చేసుకోగలిగింది. మరలా అవే పాలని ప్రయత్నించి, తమ కుమార్తె జీర్ణం చేసుకోగలుగుతుందని ఒక నిర్ధారణకొచ్చాక జ్యోతి ఆనందానికి అవధులు లేవు.
అప్పుడే ఆమె మనసులో ఒక ఆలోచన మెదిలింది. నేనెందుకు అటువంటి స్వచ్చమైన పాలని ఉత్పత్తి చేసే డైరీ పెట్టకూడదు? తమ పిల్లలకి స్వచ్చమైన పాలు అందించాలన్న నాలాంటి తల్లుల ఆవేదనకి ఎందుకు సమాధానం కాకూడదు? అనుకుంది. అయితే శుభ్రతని పాటించకపోవటం, సరైన పోషకాహారం ఆవులకి అందించలేకపోవటం వంటి కారణాల వల్ల నాణ్యత తగ్గి, వ్యాపారం చేయలేక స్థానిక డైరీలు మూత పడుతున్నాయి. అలాంటి సమయంలో జ్యోతి మొదటిగా 15 సంకరజాతి ఆవులతో చిన్న డైరీ ఏర్పాటు చేసుకుంది. తాను రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కానప్పటికీ ప్రయత్నిస్తూ, తప్పులు సరిచేసుకుంటు ఆమె సంపాదించిన కొద్దిపాటి జ్ఞానం ఆవు పాల నాణ్యతని మెరుగుపర్చింది. ఆ తరవాత ఆమె మహారాష్ట్రలోని థానేకి షిఫ్టయ్యాక నగరాల్లో స్వచ్చమైన పాల అవసరాన్ని గుర్తించింది.
నగరాల్లో స్వచ్ఛమైన పాలు దొరకని ఈ కాలంలో స్వచ్చమైన పాలు అందించే ఉద్దేశంతో, 2019లో నగర శివార్లలో లీజు తీసుకున్న రెండెకరాల భూమిలో, ‘శ్రీ బాలకృష్ణ డైరీ ఫార్మ్’ (బికేడి మిల్క్)ను ప్రారంభించారు. అక్కడ జ్యోతి, ఆమె భర్త ఆవులని స్వేచ్ఛగా తిరగనిచ్చి, నేపియార్ గడ్డి, గోధుమ గడ్డి, మిల్లెట్స్ వంటి ఆర్గానిక్ మేతతో పోషించారు. ఎటువంటి రసాయనాలు లేకుండా స్వచ్ఛమైన A2 పాలను అందించటమే లక్ష్యంగా పెట్టుకుని పని చేశారు. రసాయన, యంత్ర వినియోగం కూడా లేకుండా సాంప్రదాయ పద్దతుల్లో పాలని తీసి స్వచ్ఛంగా నగరవాసులకి అందించారు. వీరి పాల నాణ్యత బాగుండటంతో అందరూ వీళ్ళ దగ్గర పాలు తీసుకోవటం మొదలుపెట్టారు. ఈ రోజు బెకేడి మిల్క్ సుమారు 200 మంది కస్టమర్సుని సంపాదించుకుని, సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం పొందగలిగే డైరీగా ఎదిగింది. ఈ ప్రయాణంలో స్వచ్చమైన పాలని స్థిరంగా ఇవ్వటంలోనూ, నైతికతని కాపాడుకోవటంలోనూ ఆమెకున్న నిబద్ధతకి కొత్తతరపు రైతులని, కస్టమర్లని ప్రేరణ కలిగిస్తుంది.
అయితే ఆమె ప్రయాణం అక్కడితోనే ఆపేయకుండా, ఆధునిక రైతు పరీక్షిత్ తో కలిసి, ‘కౌ కరెన్సీ’ అనే వినూత్న మోడల్ తో స్వచ్ఛమైన పాలను కోరుకుంటూ, ఆవుల పెంపకపు భారాన్ని మోయలేని నగర వాసులకు ఒకపరిష్కారం చూపించింది. నగర నివాసులకు పాలు, నెయ్యి అందించే ఈ వినూత్న పథకం ద్వారా గోవును స్వంతం చేసుకునే అవకాశం కల్పించారు. రూ.1,08,000 ప్రారంభ పెట్టుబడితో, మూడు సంవత్సరాల పాటు గోవును ఫార్మ్ నిర్వహిస్తుంది. వీటితో రోజుకు రెండు లీటర్లు పాలు, నెలకు రెండు కిలోల నెయ్యి అందజేస్తుంది. ఈ ప్రాజెక్టు దశల వారీగా విస్తరిస్తూ, జ్యోతి ఈ మోడల్‌ను మరింత మెరుగ్గా రూపొందించారు. వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న పరిక్షిత్, టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని సుస్థిరంగా చేసేందుకు కృషి చేస్తున్నారు.
ఈ విధంగా స్వచ్ఛమైన పాల అవసరం నుండి ప్రారంభమైన ఓ తల్లి ప్రయత్నం వ్యాపారంలా విస్తరించి, దాంతోపాటు నైతిక వ్యవసాయ విధానాలతో లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసింది.
*రూపశ్రీ