మన భూమికి మనమే పొగపెడుతున్నామా?

 


“ధూమపానం ఆరోగ్యానికి హానికరం” అనే మాట నేడు “గాలి   పీల్చుకోవటం ఆరోగ్యానికి హానికరం” అనేలా మారిపోయిందా?.. అలాగే అనిపిస్తోంది నేటి సమాజంలో ఏర్పడిన పరిస్థితులు, జరుగుతున్న సంఘటనలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. డిసెంబర్ 2, 1984న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుండి విషపూరితమైన మిథైల్ ఐసోసయనేట్ గ్యాస్ లీక్ అయింది. ఈ సంఘటన వేల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసి, బ్రతికున్న  లక్షలమంది ఆరోగ్యంపై  దీర్ఘకాలిక  ప్రభావాన్ని  కలిగించింది.

ఇది ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పరిశ్రమ వైపరీత్యాలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ సంఘటనలో మృతుల జ్ఞాపకార్థంగానూ, పరిశ్రమల భద్రత గురించి అవగాహన పెంపొందించడంలోనూ,  ఇంకా మున్ముందు అటువంటి విషాదాలు జరగకుండా నివారించేందుకు కాలుష్య నియంత్రణ చాలా అవసరం. ఈ కాలుష్య నియంత్రణ చర్యల ప్రాముఖ్యతను గుర్తు చేయడమే ఉద్దేశ్యంగా ప్రతీ సంవత్సరం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటాము.

2024 సంవత్సరానికి జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ థీమ్: "శుభ్రమైన గాలి, పచ్చని  భూమి: స్థిరమైన జీవన దిశగా ఒక అడుగు". ఇది పర్యావరణ సమస్యలను ఎదుర్కొనేందుకు శుభ్రమైన గాలి, అందుకోసం తీసుకోవాల్సిన  చర్యల అవసరాన్ని చూపుతుంది.

కాలుష్య నియత్రణ  దినోత్సవం సంద్భంగా భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుని, మరలా అటువంటి విషాదంలో ఏ ఒక్కరి ప్రాణం బలికాకుండా ఉండటానికి ఏమేమి చెయ్యాలో చర్చించుకోవాలి.  

ప్రస్తుతం  ఢిల్లీ వంటి ప్రధాన నగరాల పరిస్థితి ఎలా ఉందంటే, బ్రతకటం కోసం పీల్చే గాలే స్లో పాయిజన్లా  నెమ్మదిగా ప్రాణాలు తీసేస్తుంది. అందుకే కాలుష్యం అనేది మన ఆరోగ్యంపై, పర్యావరణంపై, ఆర్థిక వ్యవస్థపై చూపించే  ప్రభావాలను చర్చించి, దానిమీద  అవగాహన పెంపొందించటానికి ప్రయత్నించాలి. 

ఏం చేయాలంటే.

వ్యర్థ పదార్ధాల  నిర్వహణ, ఉద్గారాల తగ్గింపు, పునరుత్పత్తి శక్తుల వినియోగం వంటి పర్యావరణానికి మేలు చేసే  చర్యలను ప్రోత్సహించాలి. 

పరిశ్రమలన్నీ  భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారా భోపాల్ గ్యాస్  వంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా నివారించాలి.

పచ్చటి భూమి పది కాలాలపాటూ కొనసాగాలంటే ఏ ఒక్కరో ముందుకి వస్తే సరిపోదు, అందరూ కలిసి ఒక సైన్యంగా పనిచేస్తేనే, కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న మన భూమాతని కాపాడుకోగలము. భవిష్యత్తు తరాలకి కాలుష్య రహిత గాలినీ, నెలనీ, నీటినీ అందించగలం. దానికోసం మనం చేయాల్సిందల్లా,  కాలుష్యం అనేది కేవలం పర్యావరణ సమస్యే కాదు,  ఇది మొత్తం మానవాళికే సమస్య అన్న నిజాన్ని గ్రహించి అది తగ్గించటానికి మనం ఏం చేయగలమో అటువైపు అడుగులు వేయాలి. 

కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా  స్థిరమైన జీవన విధానాలను స్వీకరించడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి  ప్రేరణ ఇచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుని అటువైపు దృష్టి సారించాలి.  చిన్న మార్పులు పెద్ద తేడాలను తీసుకువస్తాయి. ఈ భూ గ్రహం కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించలి.  కాలుష్యంతో పోరాటం నాతోనే ప్రారంభమవ్వాలని,  ఆ మార్పు నాతోనే మొదలవ్వాలని ప్రతీ ఒక్కరు అనుకుని  ముందడుగు వేయాలి. 


స్వచ్ఛమైన గాలి అందరి హక్కు. ఈ కాలుష్య నియంత్రణ ద్వారానే అది సాధ్యమవుతుంది. అందుకే కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా పచ్చటి భూమాత కోసం పనిచేయడం లక్ష్యంగా పెట్టుకోవాల

జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే  వివిధ కార్యక్రమాల్లో ప్రజలని భాగస్వామ్యం చేయడం ఉత్తమ మార్గం. ఇక్కడ కొన్ని ప్రయోజనకరమైన కార్యక్రమాలు ఉన్నాయి..

చెట్లు నాటే కార్యక్రమాలు:

ప్రజలని  చెట్లు నాటటానికి ప్రోత్సహించడం వల్ల గాలి నాణ్యతను మెరుగుపరచడంలో, కార్బన్ డై  ఆక్సైడ్ ను తగ్గించడంలో  సహాయపడతాయి. 

శుభ్రతా కార్యక్రమాలు:

పార్కులు, నదులు లేదా బీచ్‌ల వంటి ప్రాంతాల్లో శుభ్రతా కార్యక్రమాలు  నిర్వహించి, పరిసరాల శుభ్రత ద్వారా కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చో తెలియచేయాలి. 

అవగాహన కార్యాక్రమాలు:

గాలి, నీటి కాలుష్యానికి గల  కారణాలు,  కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలు, దాన్ని తగ్గించే మార్గాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి సెమినార్లు, వర్క్ షాప్‌లను నిర్వహించటం.  

పర్యావరణ హిత ఉత్పత్తులు పంపిణీ:

వ్యాపార సంస్థలు,  వ్యక్తులను రీయూసబుల్ బ్యాగులు, బాటిళ్లు,  స్ట్రాల వంటి ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను అందించి,  స్థిరమైన ఉత్పత్తులను ఉపయోగించడానికి ప్రోత్సహించడం. 

చిత్రకళల పోటీలు నిర్వహణ:

విద్యార్థులను పర్యావరణ అవగాహనపై పోస్టర్లు లేదా బొమ్మలు రూపొందించేందుకు ప్రోత్సహించాలి. 

వర్షపు నీటి సేకరణ : 

వర్షపు నీటిని సేకరించి భద్రపరిచే విధానం ద్వారా నీటి పరిరక్షణను ప్రోత్సహించండి.

కాంపోస్టింగ్ యూనిట్లను నిర్మించండి:

కమ్యూనిటీలకు సేంద్రీయ వ్యర్థాలను సమర్థవంతంగా కాంపోస్ట్ చేయడం వల్ల రసాయన ఎరువుల ద్వారా భూమి కాలుష్యం కాకుండా నివారించవచ్చు.

జీరో-వేస్ట్ వర్కుషాప్‌లు నిర్వహణ:

వ్యర్థాలను తగ్గించడానికి,  పదార్థాలను పునర్వినియోగం చేసేందుకు ప్రజలను ప్రేరేపించండి.

ప్రజా రవాణాను ప్రోత్సహించడం:

వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు, కార్బన్  ఉద్గారాలను తగ్గించేందుకు ప్రజలను ప్రేరేపించండి.

గ్రీన్ రూఫ్ ప్రాజెక్టులు:

భవనాలపై గ్రీన్ రూఫ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరచవచ్చు.

స్విచ్ ఆఫ్ క్యాంపెయిన్లు:

అవసరం లేని లైట్లు, పరికరాలు ఆఫ్ చేయడం ద్వారా శక్తిని ఆదా చేయొచ్చని, ఆదా చేయటం కూడా ఒక రకంగా సృష్టించటమేననే అవగాహన పిల్లలు,పెద్దల్లో కల్పించాలి.   

సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించండి:

మోటారు వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు సైక్లింగ్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మోటార్ సైకిల్ పొగ ద్వారా జరిగే కాలుష్యం ను తగ్గించవచ్చు.

కమ్యూనిటీ గార్డెనింగ్:

నగర ప్రాంతాల్లో హరిత ప్రాంతాలను సృష్టించడానికి కమ్యూనిటీ గార్డెన్లను ప్రారంభించడం.

సోషల్ మీడియా ప్రచారాలు:

సోషల్ మీడియా వేదికలపై ప్రత్యేక హాష్‌ట్యాగ్‌లు సృష్టించి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా వ్యాప్తి చేయడం.

 పర్యావరణాన్ని కాపాడటానికి,  కాలుష్యాన్ని తగ్గించటానికి  ప్రజలకు ఉండే బాధ్యతను కాలుష్య నియంత్రణ దినోత్సవం  గుర్తుచేస్తుంది. స్థిరమైన జీవన శైలిని ఆచరించడం, అవగాహన పెంచడం,  సమిష్టిగా పని చేయడం ద్వారా భవిష్యత్ తరాల కోసం మరింత పచ్చదనం,  ఆరోగ్యకరమైన భూమిని అందించవచ్చు.

 భూమిని సంరక్షించడంలో  సరైన అడుగులు వేయడానికి మనకి  ఈ రోజు ప్రేరణనివ్వాలి. ప్రకృతి మన బాధ్యత.. మన చర్యలే మన భవిష్యత్తు! అనే విషయం మర్చిపోకండి.


                                    *రూపశ్రీ 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu