విద్యా సంస్కరణలు.. లోకేష్ కు ప్రపంచబ్యాంకు ప్రశంసలు
posted on Sep 27, 2025 4:30PM

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విద్యా సంస్కరణలను ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ముఖ్యంగా సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సాల్ట్) కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు విశేషంగా ప్రస్తుతించింది. ఇటీవల విద్యా మంత్రి నారా లోకేష్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలు, ముఖ్యంగా సాల్ట్ అమలు తీరును ప్రశంసించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు ఏపీలో అమలు అవుతున్న విద్యా సంస్కరణలు ఇండియాకే కాదు, మొత్తం దక్షిణాసియాకే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
పెర్ఫార్మెన్స్ అసెస్‌మెంట్ ఫర్ లెర్నింగ్ ల్యాబ్‌లు (పీఏఎల్), ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఎఫ్ఎల్ఎన్),అలాగే కేంద్రీకృత పాఠశాల నాయకత్వ శిక్షణ వంటి కార్యక్రమాలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తార్కాణంగా పేర్కొన్నారు. అలాగే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిని కూడా సందర్శించారు. ఆ సందర్భంగా స్థానిక రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనాపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని పేర్కొన్నారు.