రైల్లో గర్భిణీకి పురిటీ నొప్పులు..వాట్సాప్ సాయంతో డెలివరీ
posted on Apr 10, 2017 5:28PM

సరదాగా ఛాటింగ్ చేసుకునే వాట్సాప్ తాను అప్పుడప్పుడు మంచికి కూడా ఉపయోగపడతానని నిరూపించింది. రైల్లో ఆకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చిన ఓ గర్భిణీకి వాట్సాప్ సాయంతో డెలివరి చేశాడు ఒక వైద్య విద్యార్థి. అహ్మదాబాద్-పూరీ రైల్లో ప్రయాణిస్తున్న చిత్రలేఖ అనే గర్భిణీకి ఒక్కసారిగా నొప్పులు రావడంతో ఆమె బంధువులు చైన్ లాగి రైలును ఆపారు. వారు ఉన్న కోచ్ వద్దకు టికెట్ కలెక్టర్ మరికొందరు రైల్వే సిబ్బంది పరుగు పరుగున వచ్చారు..కాని ఏం చేయాలో దిక్కుతోచక రైలులో ఎవరైనా డాక్టర్లు ఉన్నారేమోనని వెతికారు..అదే సమయంలో అక్కడే ఉన్న ఫైనలియర్ ఎంబీబీఎస్ విద్యార్థి విపిన్ ఖడ్సే ఆమెకు తాను వైద్యం చేస్తానని అన్నాడు.
అయితే ప్రసవ సమయంలో శిశివు తల భాగం ముందుకు రావడంతో భుజం భాగం బయటకు వచ్చింది. దీంతో ఏం చేయాలో తెలియని ఖడ్సేకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న తన సీనియర్లకు పరిస్థితిని వివరించి ఫోటోలను పంపాడు. వారి సూచనల మేరకు వైద్యం చేయడంతో ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చిత్రలేఖ బంధువులతో పాటు రైల్వే సిబ్బంది ఆ విద్యార్థిని అభినందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను నాగపూర్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. దీనిని బట్టి టెక్నాలజీని మంచి వాడితే మంచి ఫలితాలే వస్తాయని మరోసారి రుజువైంది.