పడి లేచిన కెరటం.. నారా లోకేష్

వక్రబుద్ది నేతలు చెక్కిన శిల్పం  నారా లోకేష్.  పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి   నారా లోకేష్.  టీడీపీ ప్రధాన కార్యదర్శిగా  పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకుని సాధించిన చూపిన  నిబద్దత గల కార్యదక్షకుడు లోకేష్. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి  సందేహాలూ, అనుమానాలూ లేవు.  సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి.

అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు.   హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చేశారు?  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడే పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై సైకలాజికల్ ఎటాక్ ప్రారంభించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని ప్రయత్నించారు.  ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా అన్నిటిపైనా అటాక్ చేశారు.  

అయితే లోకేష్ వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. మంత్రిగా అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చేశారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎదిగారు.    

ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని,  సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తితో  ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు.  2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ  పరాజయం, మంత్రిగా ఉండి కూడా స్వయంగా తాను పరాజయం పాలు కావడం నిజంగానే సంక్షోభం. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులు టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్న లోకేష్ ఆ సంక్షోభాన్నే అవకాశంగా మార్చుకున్నారు.  తెలుగుదేశం పార్టీకి పెద్దగా అవకాశాలు లేని మంగళగిరి స్థానంలో పరాజయం పాలైనా   అదే నియోజకవర్గంలో నిలబడి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు.  విపక్షంలో ఉండి గ  ఒక దీక్ష, ఒక తపస్సు, ఒక యజ్ణంగా తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ప్రజా నేతగా ఎదిగారు.  అలాగే యువగళం పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్ నాయకుడన్న నమ్మకాన్ని పార్టీలోనే కాదు ప్రజలలోనూ కలిగించారు.  తండ్రికి తగ్గ తనయుడన్న ప్రశంసలు అందుకున్నారు. అంతే కాదు తండ్రిని మించిన నాయకుడన్న నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజా బాహుల్యంలోనూ కలిగించారు. 

అయితే నారా లోకేష్ కు నాయకత్వం వారసత్వంగా వచ్చినది కాదు. ఆయన కష్టపడి సాధించుకున్నది. తనను తాను ప్రూవ్ చేసుకుని ప్రజలకు దగ్గరవ్వడం ద్వారా సంపాదించుకున్నది. ఇక లోకేశ్ యువగళం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో మరో చరిత్ర అనే చెప్పాలి. లోకేష్ పాదయాత్ర ద్వారా  ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు అప్పటి అధికార వైసీపీ పన్నని కుట్రలు, చేయని కుతంత్రాలు లేవు. వాటన్నిటినీ  ప్రజాదరణతో ఎదుర్కొని లోకేష్ ముందడుగు వేసిన తీరు నిజంగా నభూతో నభవిష్యతి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, ఆ తరువాత జగన్ కూడా పాదయాత్రలు చేశారు. కానీ అప్పట్లో వారికి అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురు కాలేదు.

కానీ లోకేష్ పాదయాత్ర విషయంలో అలాకాదు. జగన్ సర్కార్ ఆయన తొలి అడుగు వేయక ముందే  అడ్డంకులు సృష్టించింది. జీవో లు జారీ చేసి మరీ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. భౌతిక దాడులకు సైతం తెగబడింది. మాట్లాడుతుంటే మైకు లాగేసింది. నిలుచున్న కూర్చీ తీసేసింది.  ప్రచార వాహనాలను సీజ్ చేసింది. అయినా లోకేష్ వెరవలేదు. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడక ఆపలేదు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వేల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్ ని  తమ నాయకుడిగా ప్రజలు ఓన్ చేసుకునేందుకు దోహదపడ్డాయి.  లోకేషా.. పాదయాతా అని ఎగతాళి చేసిన వారే శభాష్ అని   ప్రశంసలు కురిపించారంటే దటీజ్ లోకేష్. 

ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రానికి పెద్ద ఎత్తున భారీ పెట్టుబడులను తీసుకురావడంలో తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇదే దీక్ష , ఇదే సంకల్పంతో ఆయన మున్ముందు మరిన్ని ఎత్తులకు ఎదగాలని ఆకాంక్షిస్తూ నారా లోకేష్ కు తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu