పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు.. తప్పేంటన్న హైకోర్టు
posted on Oct 9, 2025 2:48PM
.webp)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధం, చట్టబద్ధంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం వైద్య కళాశాలను పీపీపీ విధాంలో అభివృద్ధి చేసేందుకు గత నెల 9న ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వసుంధర దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన హైకోర్టు థర్మాసనం గురువారం విచారణ జరిపింది.
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల టెండర్ల ఖారారుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, రాజ్యాంగం లేదా చట్టాన్ని ఉల్లంఘించే నిర్ణయాల్లో తప్ప న్యాయస్థానం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. అయినా పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదే కదా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిధుల కొరత కారణంగా ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఎంచుకొని ఉండవచ్చనీ, అది తప్పెలా అవుతుందని ప్రశ్నించింది.
గత ప్రభుత్వ హయాంలో 12 వైద్య కళాశాలలకు 5వేల 800 కోట్ల రూపాయల అంచనాతో పాలనపరమైన అనుమతులు ఇచ్చారన్న పిటిషనర్ తరఫున్యాయవాది మాటలపై స్పందించిన ధర్మాసనం.. పాలనపరమైన అనుమతులిస్తే సరిపోతుందా? నిధులు విడుదల చేయాలి కదా అని నిలదీసింది. నిధుల కొరత కారణంగా పీపీపీ విధానంలో నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉండొచ్చని, అది తప్పెలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. నిధుల కొరత వల్ల జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణాలూ నిలిచిపోయాయని గుర్తు చేసింది. నిధులున్నప్పుడే కళాశాలలను నిర్మించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఎస్, వైద్యఆరోగ్య ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్యసేవలు, మౌలికాభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీ వైద్య విద్య, పరిశోధన సంస్థ ఎండీకి నోటీసులు జారీచేసింది. త దుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.