జేఎన్‌యూ వద్ద ఉద్రిక్తత... మళ్లీ మొదలు!

 

ఈ నెల 9వ తేదీన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన వివాదాస్పద సమావేశానికి సంబంధించి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వివాదంలో పోలీసులు ఇప్పటికే కన్నయా కుమార్‌ అనే విద్యార్థి నాయకుడిని అరెస్టు చేయగా ఉమర్‌ ఖాలిద్ వంటి మరికొందరు నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసులు వారికోసం లుక్‌అవుట్‌ నోటీసులను సైతం జారీ చేయడం జరిగింది. అయితే ఈ అయిదుగురూ కూడా నిన్న రాత్రి విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ప్రత్యక్షం కావడం పోలీసులను సైతం కంగుతినిపించింది.

 

దేశంలో ఎక్కడ దాక్కున్నా పోలీసులు తమను అరెస్టు చేసే ప్రమాదం ఉంది కాబట్టి విశ్వవిద్యాలయమే తమకు అసలైన రక్షణ అని ఆ అయిదుగురు విద్యార్థులూ భావించినట్లు కనిపిస్తోంది. తాము కనుక విశ్వవిద్యాలయంలో అడుగుపెడితే.... దానిని సదరు నిందితులు వివాదాస్పదంగా మార్చే అవకాశం ఉంది కాబట్టి, పోలీసులు క్యాంపస్‌ వెలుపలే ఉండిపోయారు. ఈ సందర్భంలో క్యాంపస్‌లో మళ్లీ ఉద్రిక్తత రాజుకుంటోంది. నిన్న రాత్రి కూడా వీరు అయిదుగురూ కశ్మీర్ ప్రజల స్వాతంత్ర్యం గురించి ఆవేశపూరితమైన ప్రసంగాలు చేసినట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu