జ‌గ‌న్ ‘పీపీపీ’.. డుం డుం డుం!

మెడిక‌ల్ కాలేజీల పీపీపీ విధానాల‌ పై ప్ర‌జావ్య‌తిరేక‌త ఎంత ఉందో తెలియ చేస్తూ కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల  నుంచి మెడికల్ కాలేజీల ప్రభుత్వ, ప్రైవేటు   భాగస్వామ్యం విధానానికి వ్యతిరేకంగా కోటీ  4 ల‌క్ష‌ల   ఈ సంత‌కాల సేక‌ర‌ణ చేసి గ‌వ‌ర్న‌ర్ కి స‌మ‌ర్పించారు జగన్.  ఈ సందర్భంగా ర్యాలీలు కూడా నిర్వహించారు. జగన్ స్వయంగా 40 మంది బృందంతో కాలినడకన వెళ్లి మరీ ఆ సంతకాల పత్రాలను గవర్నర్ కు అందజేశారు. అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.  ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు. 

ఇంత‌కీ జ‌గ‌న్ అండ్ కో  పీపీపీ విధానంపై చేస్తున్న విమర్శలు ఏమిటంటే..   పీపీపీ విధానంలో మెడిక‌ల్ కాలేజీ అభివృద్దికి ముందుకు వచ్చే ప్రైవేటు వ్యక్తులు కేవలం లాభాపేక్షతోనే వస్తారు. కోట్లు కొల్లగొడతారు. దీని వల్ల పేదలకు వైద్య విద్య మ‌రింత ఖ‌రీద‌వుతుంది. ఇది వారి పాలిట ఆశ‌నిపాతంగా మారుతుంది. ఇదీ జగన్ అండ్ కో అంటే జగన్, వైసీపీయులు చేస్తున్న వాదన. ఇక కోటి సంతకాలను గవర్నర్ కు సమర్పించే సందర్భంగా  జగన్ హాట్ కామెంట్లు కూడా చేశారు. అందులో యోగాంధ్ర కార్యక్రమం గురించి ప్రస్తావించారు. యోగాంధ్ర కోసం 330 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం పేదల మెడికల్ విద్య కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు. 

ఇక్కడే ఆయన ఆర్థిక అజ్ణానం బయటపడుతోంది. వాస్తవానికి ప్రభుత్వం స్వయంగా ఖర్చు చేయడం లేదు.. ప్రైవేటు వ్యక్తులను ఆ వ్యయంలో భాగస్వాములను చేస్తున్నది. అదే పంధాలో సంక్షేమ పథకాలనూ అమలు చేస్తున్నది. జగన్ హయాంలో అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేసి బటన్ నొక్కుడు అంటూ ఖజానా మొత్తం సంక్షేమం అంటే ధారపోసి జగన్ బావుకున్నదేంటి? రాష్ట్రానికి ఒరిగిందేమిటి? అంటే జగన్ కు ఘోర పరాజయం, రాష్ట్రానికి తలకు మించిన అప్పులు మాత్రమే.  ప్రభుత్వానికి తలకు మించిన భారం కాకుండా  ప్రైవేటు వ్య‌క్తుల‌ను కూడా ఇన్వాల్వ్ చేయ‌డం మంచిదే కదా అంటున్నారు ఆర్థిక నిపుణులు.

జ‌గ‌న్  హయాంలో ఆయన రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ఇంకా అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి అప్పులు తెచ్చి మరీ సంక్షేమం అంటూ చేసిన పందేరం.. ఓట్ల వేటే తప్ప మరేదీ కాదంటున్నారు.  ఇటీవల వలంటీర్ల విషయంలో తనకు జ్ణానోదయం అయ్యిందని ఇటీవల జగన్ ప్రకటించారు. మరి అప్పులు చేసి రష్ట్ర ప్రగతిని శూన్యం చేసి అమలు చేసిన సంక్షేమం దారి తప్పిందన్న విషయంలో ఆయనకు ఇంకా జ్ణానోదయం కలిగినట్లు లేదంటున్నారు విశ్లేషకులు.   ప్ర‌తిదీ ప్ర‌భుత్వం నుంచే ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల అది  పెట్టుబ‌డి అనిపించుకోదు.  

ప్ర‌భుత్వ‌మే  అన్నీ ఉచితంగా చేయ‌డం వ‌ల్ల ఎన్ని నిధులూ సరిపోవు. అప్పులే శరణ్యం అవుతుంది. అందుకే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటున్నది చంద్రబాబు సర్కార్.  ఈ విషయం అర్ధం చేసుకోకుండా,  జగన్ ఇలాగే వ్యవహరిస్తే..  2029 కాదు.. 2034నాటికి కూడా  వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులే కాదు... వైసీపీయులు కూడా  అంటున్నారు.  ఎవరో అనడం ఎందుకు జగన్ తాను స్వయంగా చేయించుకున్న సర్వేలు కూడా అవే చెబుతున్నాయి కదా!  మరి జగన్  ఈ తీరు వైసీపీని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందే. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu