ఆ ఎమ్మెల్యే గారికి కాస్త ఎవరైనా చెప్పండయ్యా!!

కరోనా దెబ్బకి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కరోనా విజృంభిస్తుండటంతో కేంద్రప్రభుత్వం మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వాల వరకు.. ప్రజలకు పలు సూచనలు చేస్తున్నాయి. బయటికి వెళ్ళొద్దని, ఇంటి వద్ద నుంచే పనిచేసుకోవాలని, ప్రయాణాలు-పెళ్లిళ్లు మానుకోవాలని ఇలా పలు సలహాలు-సూచనలు ఇస్తున్నారు. ఇక విదేశాలకు వెళ్లి వచ్చిన వారినైతే క్వారంటైన్‌ లో ఉంచుతున్నారు. రెండు వారాల పాటు బయట ప్రపంచానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సూచనలు-హెచ్చరికలు అన్నీ సామాన్య ప్రజలకేనా? ప్రజాప్రతినిధులకు పట్టవా?. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన ఓ ఎమ్మెల్యే తీరు చూస్తుంటే నిజంగానే వారికి ఏ రూల్స్ పట్టవేమో అనిపిస్తుంది.

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీరు వివాదాస్పదంగా మారింది. కోనప్ప దంపతులు ఈ నెల 16న అమెరికా నుంచి వచ్చారు. అయితే ఆయన క్వారంటైన్‌లో లో ఉండలేదు. కనీసం బయట వారిని కలవకుండా హౌస్ క్వారంటైన్‌ లోనూ ఉండట్లేదు. మాస్క్ కూడా పెట్టుకోకుండా ప్రజల్లో తిరుగుతున్నారు. అమెరికా నుండి వచ్చిన మరుసటి రోజే మున్సిపల్‌ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. అంతేనా.. ఒకవైపు ప్రభుత్వాలు.. వివాహాలు-వేడుకలు వాయిదా వేసుకోమని చెప్తుంటే.. ప్రజలకు అవగాహన కలిగించాల్సిన స్థానంలో ఉన్న కోనప్ప మాత్రం.. బంధువులు, సన్నిహితుల ఇళ్లలో జరిగిన సత్యనారాయణస్వామి వ్రతం, వివాహాలకు హాజరయ్యారు. ఇలా విదేశాల నుంచి వచ్చి కనీసం మాస్క్ కూడా లేకుండా, ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా.. ఓ ఎమ్మెల్యే ఇలా తిరగడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అన్ని పరీక్షలు చేశారని.. ఆరోగ్యంగా ఉన్నందున క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని కోనప్ప చెబుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే, వైరస్ సోకిన వెంటనే గుర్తించలేమని.. కనీసం మూడు నాలుగు రోజుల తరువాత లక్షణాలు బయటపడతాయని.. అందుకే అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఎమ్మెల్యే గారు ఇవేమి పట్టనట్టు సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుడిలా ఊరంతా తిరుగుతున్నారు. అధికార పార్టీ పెద్దలైనా ఆయనకు హితబోధ చేస్తే బావుండు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu