వాస్తవ వేదిక.. వెనుకబాటుకు నేతల అవినీతి, పాలకుల చిత్తశుద్ధిలేమి కారణం

వర్తమాన రాజకీయ, సామాజిక అంశాలపై తెలుగువన్ ‘వాస్తవ వేదిక’పై తెలుగువన్ ఎండీ రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్   విశ్లేషణాత్మక చర్చ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లోకి మార్చడంపై జరుగుతున్న చర్చ   రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ‘వాస్తవ వేదిక’ ఈ సంచికలో ఆ అంశంపై విశ్లేషణాత్మక చర్చ జరిపారు.  

ఆంధ్ర ప్రదేశ్ లో మెడికల్ కాలేజీల నిర్వహణపై   అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.  గత ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించాలనే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాన్ని   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
 అయితే  ప్రభుత్వం నేరుగా మెడికల్ కాలేజీలను నడపడం ఒక రకమైన  మూర్ఖత్వమని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ఏడు దశాబ్దాల తరువాత కూడా  ప్రభుత్వ ఆసుపత్రులు కిలోమీటర్ దూరం నుంచే గుర్తుపట్టగలిగేంత దుర్వాసనతో, అపరిశుభ్రంగా ఉంటున్నాయన్న ఆయన. విపరీతమైన   రద్దీ,  వైద్యుల కొరత, పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రభుత్వ వైద్యం ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం లేదని చెప్పారు.  ఇక  గత ప్రభుత్వం పార్వతీపురం, పిడుగురాళ్ల వంటి మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలను ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన పూర్తిగా హేతు రహితం. ఎందుకంటే..మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం మెడికల్ సీట్లు రావాలంటే  అర్హత కలిగిన ఫ్యాక్ ల్టీ అంటే ప్రొఫెసర్లు ఉండాలి.  పెద్ద డాక్టర్లు లేదా ప్రొఫెసర్లు మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.  నారాయణ వంటి ప్రైవేట్ సంస్థలే నెలకు 15 లక్షల రూపాయల జీతం ఇచ్చినా మంచి ప్రొఫెసర్లను తెచ్చుకోలేకపోతున్నాయి.

అటువంటప్పుడు ప్రభుత్వ పే-స్కేల్స్‌తో వారు ఎలా వస్తారన్నది పెద్ద ప్రశ్న. ఇక మారుమూల ప్రాంతాలకు రావడానికి అర్హత కలిగిన వారు రావడానికి ఇష్టపడకపోవడానికి వారి పిల్లల చదువులు, కుటుంబ వసతులు వంటివి అవరోధాలుగా మారుతున్నాయని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.    ఇక పీపీపీ మోడల్ అన్నది ఈ సమస్యలకు పరిష్కారమా? వ్యాపారమా అన్న విషయానికి వస్తే.. ఈ పీపీపీ మోడల్ అన్నది దేశంలో కొత్తదేమీ కాదు,   హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్, కృష్ణపట్నం, గంగవరం పోర్టులు, జాతీయ రహదారులు ఇదే మోడల్‌లో విజయవంతంగా నడుస్తున్నాయి. అటువంటప్పుడు అదే పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీల నిర్వహణకు అభ్యంతరమెందుకని ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి పీపీపీ అంటే పేరుకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఆచరణలో మాత్రం   ప్రైవేట్ నిర్వహణే అన్నారు.

 ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీల సీట్ల ధరలు భారీగా ఉన్నాయి.   సీటు 50 లక్షల నుండి కోటి  రూపాయల వరకూ,  అదే పీజీ అయితే   3 నుండి 5 కోట్ల  రూపాయల వరకూ ఉన్నాయి. కానీ ప్రైవేట్ యాజమాన్యం లాభాపేక్షతోనైనా సరే ఆసుపత్రులను శుభ్రంగా, మెరుగైన సౌకర్యాలతో నడిపే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని డోలేంద్ర ప్రసాద్ వ్యక్తం చేశారు. 

 అయితే వైసీపీ ఈ వ్యవహారాన్ని రాజకీయ కారణాలతో  పెద్ద భూతంగా చూపిస్తూ , ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందన్నారు.  రాష్ట్రంలో  కూటమి ' ప్రభుత్వం కాకుండా, ప్రతిపక్షం మరియు అధికార పక్షం కలిపి నడిపే 'కుమ్మక్కు' ప్రభుత్వం నడుస్తోందన్నారు. ప్రజలకు సంబంధం లేని విషయాలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు. భారతదేశంలో అవినీతి అన్ని రంగాలకు విస్తరించిందనీ, చైనాతో పోలిస్తే మనం అభివృద్ధిలో వెనుకబడి ఉండటానికి కారణం ఇక్కడి రాజకీయ నాయకుల అవినీతి,  పాలకుల చిత్తశుద్ధి లేమే కారణమన్నది ‘వాస్తవ వేదిక’ చర్చ సారాంశం.  మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్ అనేది కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, సామాన్యుడికి మెరుగైన వైద్యం అందే దిశగా అడుగులు వేయాల్సి ఉందని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ అన్నారు. 

పూర్తి వివరాలకు తెలుగువన్ న్యూస్ లో వాస్తవ వేదిక తొమ్మిదో ఎడిషన్ వీక్షించండి 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu