జగన్ మళ్లీ పాదయాత్ర.. అధికారమే టార్గెట్.. వర్కౌట్ అవుతుందా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సమాయత్తమౌతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో మూడేళ్ల వ్యవధి ఉండగానే జగన్ పాదయాత్ర ప్రకటన రాజకీయంగా చర్చకు తెరతీసింది. 2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రజా సంకల్పయాత్ర పేరిట దాదాపు 16 నెలల పాటు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ పాదయాత్ర కారణంగానే అప్పటి ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.  అయితే అధికారంలో ఉన్న ఐదేళ్లూ జగన్ సర్కార్ విధానాలు, జగన్ కక్ష సాధింపు రాజకీయాలు, అలాగే రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, అరకొర సంక్షేమంతో  సాగించిన పాలనా, అలాగే జగన్ అనుసరించిన ఆర్థిక అరాచకత్వ విధానాల కారణంగా 2024 ఎన్నికలలో పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా 11 స్థానాలకే పరిమితమైంది.  గత ఎన్నికలలో పరాజయం తరువాత జగన్  రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు. ఎక్కువగా బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ కే పరిమితమౌతూ రాష్ట్రంలో పార్ట్ టైమ్ రాజకీయాలు నెరపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలహీనపడింది. 

ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే పాదయాత్ర శరణ్యమని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.  తాజాగా తాడేపల్లిలోని పార్టీ క్యాంపు ఆఫీసులో ఏలూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ తన పాదయాత్ర ప్రకటన చేశారు.  తన ప్రకటన పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతుందని ఆయన భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.  

అయితే జగన్ పాదయాత్ర @ 2.0 వల్ల పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు ఆయన సుదీర్ఘ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. అప్పట్లో ఆయన అడుగుకో హామీ అన్నట్లుగా వాగ్దానాలు గుప్పించారు. వాటిని నమ్మి జనం ఆయన పార్టీకి బ్రహ్మరథం పట్టి ఆ ఎన్నికలలో ఘన విజయం చేకూర్చి పెట్టారు. అయితే అయిదేళ్ల పాలనలో  పాదయాత్ర ద్వారా వచ్చిన మైలేజీని పూర్తిగా పోగొట్టుకోవడమే కాకుండా,   తీవ్ర ప్రజా వ్యతిరేకతను కూడా జగన్ మూటగట్టుకున్నారు. హామీల అమలు విషయాన్ని పట్టించుకోలేదు. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అరకొరగా అమలు చేశారు. అంతే కాకుండా  అధికారంలో ఉన్నప్పుడు జనం మొహం చూడటానికి కూడా ఇష్టపడకుండా, బయటకు వచ్చినప్పుడు రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టుకు తిరిగిన జగన్.. పార్టీ పరాజయం తరువాత కూడా పెద్దగా జనంలోకి రాలేదు. మరి ఇప్పుడు పాదయాత్ర అంటూ మరో సారి జనం ముందుకు వచ్చే ప్రయత్నం ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్నది అనుమానమేనన్నది పరిశీలకుల విశ్లేషణ.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu