ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి వాంగ్మూలం రికార్డ్ చేసిన ఈడీ
posted on Jan 22, 2026 12:28PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిని గురువారం (జనవరి 22) విచారించి, ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. జగన్ హయాంలో మద్యం విధాన రూపకల్పన, అమలు ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై ఈడీ విజయసాయిపై ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే భారీగా అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలపైనా ఈడీ విజయసాయిని సుదీర్ఘంగా విచారించింది. అదే విధంగా మద్యం కుంభకోణం ద్వారా అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించిన అంశం, హవాలా మార్గాల వినియోగం, షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.
డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఏపీలో మద్యం విక్రయాలు క్యాష్ అండ్ క్యారీ రూపంలోనే నగదు రూపంలోనే ఎందుకు జరపాల్సి వచ్చిందన్న అంశంపై ఈడీ అధికారులు విజయసాయిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పనపై తన సమక్షంలోనే మూడు సార్లు సిట్టింగులు జరిగినట్లు విజయ్ సాయి రెడ్డి ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్లూ, అయితే ఆ పాలసీ రూపకల్పనతో తనకు ప్రత్యక్ష సంబంధం లేదని చేసినట్లు తెలిసింది.
ఇక ఇదే కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డిని విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే ఇప్పటికే పలువురు కీలక వ్యక్తుల పాత్రపై ఫోకస్ పెట్టిన ఈడీ.. రానున్న రోజులలో మరింత మందిని విచారించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోవడంతో విజయసాయి, మిథున్ రెడ్డిల విచారణ అనంతరం ఈడీ టార్గెట్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.