కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను రద్దు చేసిన హైకోర్టు
posted on Mar 20, 2020 1:25PM

వరుసగా సవాళ్లు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఇప్పుడు న్యాయ పరంగా చుక్కెదురైంది. ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనల్లో భాగంగా.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా..న్యాయ విభాగం పరిధిలోకి వచ్చే శాఖలను కర్నూలును తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే జీవో 13 జారీ విషయంలో వివాదం నెలకొని ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పూర్తి సమాచారం లేకుండానే ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక అధికారి సూచన మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగింది. ఇక, ఈ జీవోల పైన హైకోర్టులో దాఖలైన పిటీషన్ల పైన ప్రభుత్వ వివరణ కోరింది. స్థలం సమస్య కారణంగానే కర్నూలుకు మారుస్తున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే, స్థలం సరిపోకుంటే పక్క భవనాల్లోకి మార్చుకోవచ్చంటూ కోర్టు సూచించింది.
ప్రభుత్వం నుండి సమాధానం వచ్చిన తరువాత హైకోర్టు కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ జి.వో 13 పై సి.ఎస్. సంతకం లేకపోవడం,సచివాలయం అధికారుల రోజువారీ పనిని గమనించుటకు ఏర్పాటు చేసిన విజిలెన్సు కమిషన్ ఆఫీస్ ను సచివాలయం కు దూరంగా మార్చడం దురుద్దేశంతో కూడుకున్నది అని న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించిన పిల్ 20/20 లో ఈ రోజు హైకోర్టు జి.వో 13 ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు జారీ చేసిన జీవో సస్పెన్షన్ చేస్తూ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయాల అమలకు వరుస బ్రేకులు పడుతున్నాయి. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లులకు మండలిలో అడ్డు తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనా కారణంగా ఎన్నికల సంఘం ఆరు వారాలు ఎన్నికలను నిలుపుదల చేసారు. ఇదే అంశం పైన సుప్రీంకు వెళ్లిన ప్రభుత్వానికి అక్కడ ప్రతికూల ఫలితం వచ్చింది. అయితే, కొంత వెసులుబాటు మాత్రం కలిగింది. ఇక, ఇప్పుడు కర్నూలుకు కార్యాలయాల తరలింపు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎలాగైనా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే మూడు రాజధానుల వివాదానికి ముగింపు పలికి..విశాఖ నుండి పరిపాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ముహూర్తం సైతం ఖరారు చేసింది. అయితే, ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ప్రభుత్వ ఆలోచనలకు బ్రేక్ పడింది.