పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయనున్న తెరాస ప్రభుత్వం
posted on Oct 27, 2015 11:34AM
.jpg)
ఎట్టకేలకు తెలంగాణా ప్రభుత్వం దిగివచ్చింది. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే పంట రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేయబోతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న ప్రకటించారు. అదే విధంగా ప్రతిపక్షాలు చేస్తున్న మరో డిమాండ్ కరువు మండలాలను ప్రకటించి తక్షణమే ఆ మండలాలకి ప్రత్యేక ఆర్ధిక సహాయం అందించడానికి కూడా తెరాస ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు.
పంట రుణాలను ఒకేసారి కాకుండా వాయిదాల పద్దతిలో ప్రభుత్వం మాఫీ చేస్తుండటం వలన తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్న రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని కనుక పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయమని ప్రతిపక్షాలు శాసనసభ సమావేశాలలో ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. ప్రభుత్వం వారి విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించకపోగా, ‘ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతూ అందుకు అంగీకరించనందుకు శాశనసభ సభ సమావేశాలు జరుగానీయకుండా అడ్డుపడుతున్నయంటూ’ అందరినీ సభ నుండి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొంది. తెరాస మంత్రులు తమ ప్రభుత్వాన్ని సమర్ధించుకొంటూ, ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి అంత భారీ మొత్తం విడుదల చేయలేదు. ఆ సంగతి తెలిసే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే నోటికివచ్చినట్లు డిమాండ్స్ చేస్తున్నాయి,” అని వాదించారు. కానీ మళ్ళీ ఇప్పుడు వారే పంట రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
బహుశః ప్రతిపక్షాలు రాష్ర్ట వ్యాప్తంగా చేపట్టిన రైతు భరోసా యాత్రల వలన ప్రజలలో, ముఖ్యంగా రైతులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చును. పైగా త్వరలో వరంగల్ ఉప ఎన్నికలు ఆ తరువాత జి.హెచ్.ఎం.సి ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇటువంటి సమయంలో ప్రజలలో వ్యతిరేకత ఏర్పడితే ఎన్నికలలో గెలవడం చాలా కష్టం. ఒకవేళ ఓడిపోతే అది ప్రజా వ్యతిరేకత వలననే ఓడిపోయిందని ప్రతిపక్షాలు ఇంకా జోరుగా ప్రచారం చేయవచ్చును. అప్పుడు ఇంకా అప్రదిష్ట మూటగట్టుకోవలసి ఉంటుంది. అందుకే తెరాస ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ నిర్ణయం తీసుకోన్నట్లుంది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం చేసిన జాప్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అధికారం చేప్పట్టిన వెంటనే ఇదే నిర్ణయం అమలుచేసి ఉండి ఉంటే బహుశః వారందరి ప్రాణాలు కాపాడబడి ఉండేవేమో?